అనుష్క ఆడియో సరిపోవడం లేదా

ఘాటీ విడుదల రోజుల నుంచి గంటలకు మారిపోయింది. పలు వాయిదాల తర్వాత రిలీజ్ కు రెడీ అయిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో అనుష్క టైటిల్ రోల్ చేయడం వల్ల జనంలో ఆసక్తి అయితే కనిపిస్తోంది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆ స్థాయిలో లేకపోవడం కొద్దిగా ఆందోళన కలిగిస్తోంది. దర్శకుడు క్రిష్ తెరపై స్వీటీ విశ్వరూపం చూస్తారని బల్లగుద్ది చెబుతున్నారు. నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి ఇదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువి క్రియేషన్స్ కావడంతో బడ్జెట్ పరంగా రాజీ లేదని ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. మరి సోషల్ మీడియాలో అంత సౌండ్ లేకపోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం.

అనుష్క బయటికి రాకుండా కేవలం ఆడియో రూపంలో ఇస్తున్న ఇంటర్వ్యూలు, ఛాట్లు సాధారణ ప్రేక్షకుల్లో అంత ఎగ్జైట్ మెంట్ కలిగించడం లేదనేది వాస్తవం. నేరుగా మీడియా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ త్వరగా సొంతం చేసుకుంటారు. లైవ్ కాకపోయినా కనీసం రికార్డెడ్ రూపంలో ఇచ్చినా చాలు సంతోషంగా మురిసిపోతారు. హరిహర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ కే ప్రమోషన్ తిప్పలు తప్పలేదు. అలాంటిది అనుష్క కనిపించకపోయినా పర్లేదు, వినిపిస్తే అదే మహా ప్రసాదమని మురిసిపోయే పరిస్థితులు వాస్తవంగా లేవు.

ఒకవేళ ఉదయం మొదటి షో కాగానే పాజిటివ్ టాక్ వచ్చిందా ఈ డిస్కషన్ మొత్తం దూదిపింజెలా ఎగిరిపోతుంది. కొంచెం అటుఇటు అయినా అనుష్క మీదే మొదటి నింద వస్తుంది. ప్రధాన నగరాలు మినహాయిస్తే ఘాటీకి జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో బుకింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. అంటే అనుష్క ఆడియో పూర్తి స్థాయిలో పని చేయలేదు. జనం వీడియోను డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇకపై వరసగా సినిమాలు చేస్తానని చెబుతున్న అనుష్క ఇప్పుడు ఒకటి రెండు సార్లు కనిపించేస్తే పనైపోతుంది కదా. ఒకవేళ రిలీజ్ తర్వాత ఏదైనా సర్ప్రైజ్ లాంటిది ప్లాన్ చేస్తారేమో. జరగదని తెలిసినా ఆశపడటం తప్పేం కాదుగా.