తిరిగొస్తానంటున్న ఇలియానా

గతంలో హీరోయిన్ల‌కు పెళ్లి అయి, పిల్ల‌లు పుట్టారంటే ఇక మ‌ళ్లీ సినిమాల వైపు చూడ‌డం త‌క్కువ‌గానే ఉండేది. చాలామంది కెరీర్లు అలాగే క్లోజ్ అయిపోయాయి. కానీ ఈ రోజుల్లో పెళ్లి త‌ర్వాత కూడా చ‌క్క‌గా కెరీర్ కొన‌సాగిస్తున్నారు. మాతృత్వం వ‌ల్ల చిన్న గ్యాప్ వ‌చ్చినా.. ఆ త‌ర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయిపోతున్నారు. గోవా బ్యూటీ ఇలియానా ఇందులో ఏ కోవ‌కు చెందుతుందా అని ఆమె అభిమానులు చూస్తున్నారు. మైకేల్ డోల‌న్ అనే విదేశీయుడిని సీక్రెట్‌గాపెళ్లాడిన ఆమె.. ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్ల‌యింది. తొలి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చే వ‌ర‌కు ఆమె పార్ట‌న‌ర్ గురించి ప్ర‌పంచానికి తెలియ‌దు.

గ‌త ఏడాది రెండో బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నిచ్చిన ఇలియానా.. మీడియాలో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. కానీ ఆమె న‌టించిన పాత సినిమాలు రెండు గ‌త ఏడాది విడుద‌ల‌య్యాయి. దాదాపు నాలుగేళ్లుగా ఆమె ఏ సినిమాలోనూ న‌టించ‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రి ఇలియానా ఇలాగే ఫిలిం ఇండ‌స్ట్రీకి దూరంగా ఉండిపోతుందా.. మ‌ళ్లీ ఆమెను వెండితెర‌పై చూడ‌లేమా అంటే.. అలాంటిదేమీ లేద‌ని అంటోంది ఇల్లీ బేబీ.

తాను మ‌ళ్లీ క‌చ్చితంగా సినిమాల్లో న‌టిస్తానని.. కానీ అందుకు కొంచెం స‌మయం ప‌డుతుంద‌ని ఆమె వెల్ల‌డించింది. మ‌ళ్లీ సినిమాల్లో న‌టించేందుకు తొంద‌ర‌ప‌డ‌డం లేదు. నా ఇద్ద‌రు కొడుకులను చూసుకుంటూ బిజీగా ఉన్నాను. కానీ మ‌రోసారి వెండితెర‌పై అల‌రించేందుకు సిద్ధంగానే ఉన్నాను. అభిమానులు న‌న్నెంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోగ‌ల‌ను.

న‌ట‌నంటే నాకెంతో ఇష్టం. తెర‌పై క‌నిపించ‌డం, భిన్న‌మైన పాత్ర‌లు పోషించ‌డం, సెట్లో ఉండే సంద‌డి, గొప్ప వ్య‌క్తుల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం.. ఇవ‌న్నీ మిస్స‌వుతున్నా. మ‌రోసారి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అందరినీ అల‌రించాల‌ని ఉంది. కానీ ఇప్పుడు నా పిల్ల‌ల బాధ్య‌త ముఖ్యం. కాబ‌ట్టి కొన్ని రోజులు ఆగాక మీ ముందుకు వ‌స్తా. అదెప్పుడు అన్న‌ది మాత్రం చెప్ప‌లేను. నేను ఏ ప‌ని చేసినా దానికి పూర్తి న్యాయం చేస్తా. తిరిగి సినిమాల్లోకి వ‌చ్చే ముందు మాన‌సికంగా, శారీర‌కంగా న‌న్ను నేను సిద్ధం చేసుకోవాలి. అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది అని ఇలియానా చెప్పింది. రిలీజ్ ప్ర‌కారం గ‌త ఏడాది వ‌చ్చిన దో ఔర్ దో ప్యార్ ఇలియానా చివ‌రి చిత్రం.