ఓటీటీ లోకి కన్నప్ప వచ్చేస్తున్నాడు

మంచు ఫ్యామిలీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం.. ‘కన్నప్ప’. ఈ సినిమా తీయడానికి పుష్కర కాలం క్రితమే సన్నాహాలు మొదలుపెట్టాడు మంచు విష్ణు. కొడుకు కలల సినిమాకు మోహన్ బాబు ఇవ్వాల్సిన సహకారం అంతా ఇచ్చారు. మేకింగ్ ఆలస్యమై.. రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు పడి.. చివ‌రికి జూన్ నెలాఖ‌ర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. రూ.200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా తొలి వీకెండ్లో ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే తెచ్చుకుంది కానీ.. త‌ర్వాత నిల‌బ‌డ‌లేక‌పోయింది. రిలీజ్ ముంగిట ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ హ‌క్కుల‌ను సైతం మంచు విష్ణు అమ్మ‌లేదు. క‌ట్ చేస్తే క‌న్న‌ప్ప రిలీజ్ త‌ర్వాత మిగ‌తా సినిమాల్లా నెల రోజుల్లో ఓటీటీలోకి రాలేదు.

విడుద‌లైన మూడు నెల‌ల త‌ర్వాత కానీ ఆ చిత్రానికి ఓటీటీ డీల్ ఖ‌రారు కాలేదు. హ‌క్కుల‌ను ఎంత మొత్తానికి అమ్మారు అన్న‌ది క్లారిటీ లేదు కానీ.. క‌న్న‌ప్ప స్ట్రీమింగ్ డేట్ మాత్రం వ‌చ్చేసింది. సెప్టెంబ‌రు 4 నుంచి స్ట్రీమింగ్ జెయింట్ అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా డిజిట‌ల్‌గా విడుద‌ల కానుంది. అతిథి పాత్రే అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ న‌టించిన సినిమా కావ‌డంతో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వాళ్లు ఓటీటీలో చూడాల‌ని ఎదురు చూస్తున్నారు. సినిమాకు యావరేజ్ టాక్ రావ‌డం, క్లైమాక్స్ అద్భుత‌మ‌ని, మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని టాక్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఓటీటీలో ఈ సినిమాను ఎంతమంది చూస్తారో వేచి చూడాలి.

ఈ రోజుల్లో పెద్ద సినిమాల‌న్నీ విడుద‌ల‌కు ముందే డిజిట‌ల్ డీల్స్ ఖ‌రారు చేసుకుంటున్నాయి. కానీ క‌న్న‌ప్ప‌కు మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. అలా అని ఆ సినిమాకు ఆఫ‌ర్లు రాలేద‌ని కాదు. విడుద‌ల ముంగిట కొన్ని ఓటీటీ సంస్థ‌ల‌తో అత‌ను సంప్ర‌దింపులు జ‌రిపాడు. ఐతే ఒక ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ కోట్ చేసిన రేటు న‌చ్చ‌క‌.. హిట్టు కొట్టి ఆ త‌ర్వాత డీల్ మాట్లాడ‌తానంటూ ఛాలెంజ్ చేసిన విష‌యాన్ని విష్ణునే స్వ‌యంగా వెల్ల‌డించాడు. బ‌హుశా అది అమేజాన్ ప్రైమే కావ‌వ‌చ్చేమో. మ‌రి విడుద‌ల‌కు ముందు వాళ్లెంత కోట్ చేశారో.. ఇప్పుడు ఈ రేటుకు విష్ణు సినిమాను అమ్మాడో?