కూలీపై తప్పుగా అంచనాలు పెట్టుకున్నారన్న లోకేష్‌

ఈ మ‌ధ్య కాలంలో విప‌రీత‌మైన హైప్ తెచ్చుకుని, చివ‌రికి కంటెంట్ చూస్తే ఆ హైప్‌కు ద‌రిదాపుల్లో లేని సినిమా అంటే.. కూలీ అనే చెప్పాలి. ఖైదీ, విక్ర‌మ్ చిత్రాల‌తో బంప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న లోకేష్ క‌న‌క‌రాజ్.. ఆ త‌ర్వాత తీసిన లియో సినిమాకు కూడా అదిరిపోయే హైప్ వ‌చ్చింది. కానీ ఆ సినిమా అనుకున్న రీతిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా విష‌యంలో జ‌రిగిన తప్పుల‌ను స‌రిదిద్దుకుని కూలీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాడ‌ని ఆశిస్తే.. ఇదీ ఆ బాట‌లోనే సాగింది. ద‌శా దిశా లేకుండా సాగిన క‌థాక‌థ‌నాలు.. లాజిక్కులు లేని సీన్లు.. బోరింగ్ స్క్రీన్ ప్లే సినిమాను నీరుగార్చేశాయి.

ఐతే ముందు ఉన్న హైప్ వ‌ల్ల సినిమాకు ఓపెనింగ్స్ అయితే బాగానే వ‌చ్చాయి. ఓవ‌రాల్‌గా సినిమా పెద్ద డిజ‌ప్పాయింట్మెంట్ అన‌డంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమా మీద అంచ‌నాలు పెట్టుకోవ‌డ‌మే ప్రేక్ష‌కుల త‌ప్పు అన్న‌ట్లు మాట్లాడుతున్నాడు లోకేష్ క‌న‌క‌రాజ్. కూలీ రిలీజ్ త‌ర్వాత తొలిసారిగా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన స్పంద‌న గురించి అత‌ను మాట్లాడాడు. ట్రైల‌ర్ చూసి ఇది టైం ట్రావెల్ స్టోరీ అని కొంద‌రు అనుకున్నార‌ని.. అలాగే ఎల్సీయూలో భాగం అని కూడా అంచ‌నాలు పెట్టుకున్నార‌ని.. కానీ కూలీలో అవేమీ ఉండ‌వ‌ని తాను రిలీజ్‌కు ముందే స్ప‌ష్టంగా చెప్పాన‌ని లోకేష్ పేర్కొన్నాడు.

అయినా ప్రేక్ష‌కులు కూలీ మీద ఏవేవో అంచ‌నాల‌ను థియేట‌ర్ల‌కు వ‌చ్చార‌ని.. ఆ విష‌యంలో తానేమీ చేయ‌లేన‌ని లోకేష్ తెలిపాడు. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు తాను క‌థ రాయ‌లేన‌ని అత‌న‌న్నాడు. కూలీ సినిమాతో ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాను అంటే, ఈసారి మ‌రింత గ‌ట్ట‌గా ప్ర‌య‌త్నిస్తాన‌ని అత‌న‌న్నాడు. త‌న త‌ర్వాతి ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఈసారి ప్రేక్ష‌కులు ఏ అంచ‌నాలు పెట్టుకోలేని సినిమా తీస్తాన‌ని అత‌ను వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. లెక్క ప్ర‌కారం అత‌ను కూలీ త‌ర్వాత ఖైదీ-2 తీయాల్సింది. కానీ ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ క‌ల‌యిక‌లో వేరే సినిమా చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి.