టాలీవుడ్ గురించి శివకార్తికేయన్ ఓపెన్ స్టేట్మెంట్

ఎప్పటి నుంచో శివకార్తికేయన్ సినిమాలు తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నా ప్రేక్షకుల్లో గుర్తింపు, మార్కెట్ లో డిమాండ్ మొదలయ్యింది వరుణ్ డాక్టర్ తోనే. అక్కడి నుంచి క్రమంగా గ్రిప్ తెచ్చుకున్నాడు. కాలేజీ డాన్ నిర్మాతలకు లాభాలు ఇవ్వగా, మహావీరుడు పెట్టుబడిని రికవర్ చేసింది. ఇక అమరన్ ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ సాధించి హక్కులు కొన్న బయ్యర్లకు లాభాలు కురిపించింది. అందుకే ఇక్కడి అభిమానుల మీద తనకు ప్రత్యేక గురి. శివ కార్తికేయన్ కొత్త సినిమా మదరాసి సెప్టెంబర్ 5 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు.

ఈ సందర్భంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ ఇక్కడ కంటెంట్ బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతారని, అందుకే తరచుగా టాలీవుడ్ లో వెయ్యి కోట్ల సినిమాలు వస్తుంటాయని అన్నాడు. అతను ఉద్దేశించింది నిర్మాత ఎన్వి ప్రసాద్ నే అయినా చెప్పాలనుకున్నది మాత్రం బాహుబలి, పుష్ప, కల్కి లాంటి వాటి గురించే. ఆ మధ్య దర్శకుడు మురగదాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమిళ డైరెక్టర్లు ఎడ్యుకేట్ చేయడానికి సినిమాలు తీస్తారని, అందుకే వెయ్యి కోట్లు రావనే రీతిలో చెప్పడం సోషల్ మీడియాలో మిస్ ఫైరయ్యింది. ఇంత అనుభవమున్న వ్యక్తి ఇలా సిల్లీగా మాట్లాడతారా అంటూ నెటిజెన్లు ట్రోలింగ్ చేశారు.

ఇప్పుడు ఆయన హీరోనే పూర్తి విరుద్ధమైన స్టేట్ మెంట్ ఇవ్వడం గమనార్హం. శివ కార్తికేయన్ ఏ కోణంలో అన్నా అందరూ ఒప్పుకునే వాస్తవమే ఇది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ కు జవాన్ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది, రన్బీర్ సింగ్ కి యానిమల్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇచ్చింది, కెజిఎఫ్ లాంటి డబ్బింగ్ మూవీతో హిందీలోనూ రికార్డులు బద్దలు కొట్టింది, ఆర్ఆర్ఆర్ తో జపాన్ లో వంద రోజులు మన సినిమాలు ఆడేలా చేసింది అందరూ దక్షిణాది దర్శకులే. వీళ్ళందరూ వెయ్యి కోట్ల సినిమాలు తీసినవాళ్ళే. కూలీతో థౌజండ్ క్రోర్ కల తీరలేదని ఫీలవుతున్న తమిళ మూవీ లవర్స్ ఇప్పుడీ మదరాసి మాటలను ఎలా రిసీవ్ చేసుకుంటారో.