అప్పుడప్పుడూ చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడి అనూహ్య విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. స్టార్లు లేకపోయినా సరే.. కంటెంట్‌తో అవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా ఆ కోవలోకే చేరుతుందా అనే అభిప్రాయం కలుగుతోంది దాని ట్రైలర్ చూస్తే. నైంటీస్ మిడిల్ క్లాస్‌తో మంచి గుర్తింపు సంపాదించిన మౌళి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఫేమ్ శివాని నగరం కథానాయికగా నటించింది. నైంటీస్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం విశేషం.
సాయిమార్తాండ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. నైంటీస్ సిరీస్‌కు ఎక్స్‌టెన్షన్ అనిపించేలా ఈ సినిమా తెరకెక్కినట్లు అనిపిస్తోంది. చదువులో బాగా వెనుకబడ్డ టీనేజీ అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే ప్రేమ కథ ఇది. మామూలుగా హీరోయిన్ని మంచి చదువరిగా, హీరోను మొద్దుగా చూపిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరూ డల్ స్టూడెంట్సే. వారి మధ్య పరిచయం.. ప్రేమ.. ఆ తర్వాత ఎడబాటు.. ఇరు కుటుంబాల నుంచి ఎదురయ్యే అడ్డంకులు.. ఘర్షణ.. ఈ నేపథ్యంలో కథ సాగేట్లు కనిపిస్తోంది.
ఐతే కథలో ఎక్కువ సీరియస్‌నెస్ లేకుండా పూర్తిగా వినోదాత్మకంగా సినిమాను నడిపించినట్లున్నారు. ట్రైలర్లో పంచులకు లోటే లేదు. ప్రతి క్యారెక్టరూ ఫన్ అందించడమే లక్ష్యంగా సాగేట్లు కనిపిస్తోంది. ట్రెండీ డైలాగులతో యువతను బాగా ఆకర్షించేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ఎక్కువగా సీరియస్ క్యారెక్టర్లు చేసే రాజీవ్ కనకాల సైతం ట్రైలర్లో పంచులతో మంచి వినోదాన్నందించాడు.
నీకు అన్నీ నేను ఇస్తే స్క్రీన్ మీద నాగార్జున ఫొటో ఏంటి అంటూ కొడుకును అడిగే సీన్ హైలైట్. లీడ్ రోల్స్ చేసిన మౌళి, శివాని కూడా ఆకట్టుకున్నారు. సెప్టెంబరు 5న ఘాటి, మదరాసి లాంటి కాస్త పెద్ద స్థాయి ఉన్న సినిమాలతో ఈ చిన్న చిత్రం పోటీ పడనుంది. కానీ యూత్ ఈ సినిమాకు మంచి ఓపెనింగ్సే ఇచ్చేలా ఉన్నారు. పాజిటివ్ టాక్ వస్తే సినిమా పెద్ద హిట్టయినా ఆశ్చర్యం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates