మన దర్శకులు ఏం మిస్సవుతున్నారో అప్పుడప్పుడు శాటిలైట్ ఛానల్స్ గుర్తు చేస్తూ ఉంటాయి. ఓటిటిలో వచ్చాక వీటిని చూడటం తగ్గిన మాట వాస్తవమే కానీ ఇప్పటికీ కొన్ని కోట్ల మధ్యతరగతి ఇళ్లకు కేబుల్ కనెక్షనే ప్రధాన వినోద సాధనం. అందుకే నిర్మాతలకు ఇంకా ఆదాయ వనరుగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ కి సైతం భారీ టిఆర్పి రేటింగ్స్ రావడం లేదు. వందల కోట్లు కొల్లగొట్టిన పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాంలు బుల్లితెరపై మాత్రం అల వైకుంఠపురములో, టెంపర్, సరిలేరు నీకెవ్వరులను దాటలేకపోయాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చట వాటి గురించి కాదు.
ఇటీవలే జెమిని ఛానల్ లో వెంకటేష్ పాత సినిమా సంక్రాంతి టెలికాస్ట్ అయ్యింది. ఇప్పటికే ఎన్ని వందలసార్లు ప్రసారం చేసుంటారో లెక్క చెప్పడం కష్టం. అయినా సరే జనాలు దీన్నే అతుక్కుపోయి చూశారు. అర్బన్ రూరల్ కలిపి ఏకంగా 6.08 రేటింగ్ సాధించింది. దానితో పాటు ఇతర ఛానల్స్ లో ప్రసారమైన నాగచైతన్య తండేల్ 5.08, సిద్దు జొన్నలగడ్డ జాక్ 4.45 తెచ్చుకోవడం గమనార్హం. కేవలం అర్బన్ మాత్రమే తీసుకుంటే సంక్రాంతి (5.23) కన్నా తండేల్ (5.32), జాక్ (5.80) ముందంజలో ఉన్నాయి. అంటే సిటీలు కాకుండా పట్టణాలు, గ్రామాల్లో సంక్రాంతిని ఎగబడి చూశారని అర్థమవుతోంది.
2005లో విడుదలైన సంక్రాంతి అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. తమిళ మూవీ ఆనందంని నాలుగేళ్ల తర్వాత రీమేక్ చేసినా తెలుగు ప్రేక్షకులు పట్టం గట్టారు. వెంకటేష్ కున్న బలమైన ఫ్యామిలీ ఫాలోయింగ్ థియేటర్లను హౌస్ ఫుల్స్ చేసింది. సెంటిమెంట్, ఎమోషన్స్ తో పాటు ఎస్ ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన మంచి పాటలు, చక్కని సంభాషణలు, క్లీన్ ఎంటర్ టైన్మెంట్ మళ్ళీ మళ్ళీ చూసే రిపీట్ వేల్యూని తీసుకొచ్చాయి. ఎలివేషన్లు, బిల్డప్పులు, చీకటి ప్రపంచాలు, హీరోయిజం కథలతో మునిగితేలుతున్న దక్షిణాదికి ఇలాంటి సినిమాలు కావాలి. అందుకే మొన్న పండక్కు సంక్రాంతికి వస్తున్నాంకు కనకవర్షం కురిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates