ఎంత గొప్ప దర్శకుడైనా ఏదో ఒక దశలో ఔట్ డేట్ అయిపోవడం.. వరుస ఫెయిల్యూర్లు ఎదుర్కొని నెమ్మదిగా ఇండస్ట్రీ నుంచి సైడ్ అయిపోవడం మామూలే. ఇందుకు మినహాయింపు అనదగ్గ దర్శకులు అరుదుగా ఉంటారు. యమలీల, శుభలగ్నం, మావిచిగురు లాంటి మరపురాని చిత్రాలను అందించి 90వ దశకంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు సంపాదించిన ఎస్వీ కృష్ణారెడ్డి.. కెరీర్లో ఒక దశ దాటాక వరుస ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు.
రీమేక్ మూవీ అయిన ‘పెళ్ళాం ఊరెళ్తే’ తప్పితే గత రెండు దశాబ్దాల్లో ఆయనకు హిట్ లేదు. దీంతో ఆయన సినిమాలే మానేసే పరిస్థితి వచ్చింది. చాలా గ్యాప్ తీసుకుని యమలీల-2 అని ఒక సినిమా తీస్తే అది దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత చాలా ఏళ్లకు తన హిట్ మూవీ ఆహ్వానంను ఇంగ్లిష్‌లో ‘డైవర్స్ ఇన్విటేషన్’ పేరుతో తీసి చేతులు కాల్చుకున్నారు. ఆ సినిమా రిలీజైందో లేదో కూడా తెలియదు. అంతటితో దర్శకుడిగా కృష్ణారెడ్డి కెరీర్ ముగిసిందని అనుకుంటే.. కొన్నేళ్ల విరామం తర్వాత‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అంటూ ఓ సినిమా చేశారు. దాని ఫలితం కూడా మారలేదు. ఆ సినిమా రిలీజైనట్లు కూడా జనాలకు తెలియదు. ఐతే ఇన్ని ఫెయిల్యూర్ల తర్వాత కూడా ఈ లెజెండర్ డైరెక్టర్ ప్రయత్నం ఆపలేదు.
కొత్తగా వేదవ్యాస్ అనే సినిమాను మొదలుపెట్టారు కృష్ణారెడ్డి. ఇది ఆయనకు డ్రీమ్ ప్రాజెక్టు అట. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అట. అందులో నటిస్తున్నది తెలుగు నటి కూడా కాదు. దక్షిణ కొరియాకు చెందిన జున్ హ్యూన్ జీ ఇందులో లీడ్ రోల్ చేస్తోంది. రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో దిల్ రాజు, వి.వి.వినాయక్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. తన కెరీర్ పీక్స్‌లో తన సినిమాలకు తనే అద్భుతమైన సంగీతం అందించుకున్నారు కృష్ణారెడ్డి. వేదవ్యాస్‌కు కూడా ఆయనే స్వరాలు సమకూర్చుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా కృష్ణారెడ్డి మళ్లీ ఓ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates