OG… ఇంత స్పీడేంటి గురూజీ

సెప్టెంబర్ 25 ఎంతో దూరంలో లేదు. నెలల కౌంట్ డౌన్ ఇప్పుడు రోజుల్లోకి వచ్చేసింది. వాయిదా ప్రచారాలకు చెక్ పెడుతూ ఓజిగా పవన్ కళ్యాణ్ రాకలో ఎలాంటి అనుమానాలు లేవు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకటించిన డేట్ కన్నా ముందే మొదలుపెట్టినా ఫ్యాన్స్ చూపిస్తున్న దూకుడు బయ్యర్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇరవై నాలుగు గంటల నిడివిలో కేవలం 46 షోల నుంచే 80 వేల డాలర్లకు పైగా వసూలు చేయడం కొత్త రికార్డు. అగ్ర స్థానంలో ఉన్న దేవరని దాటేసి ఓజి ఇంత గ్రాండ్ గా బ్యాటింగ్ మొదలుపెట్టేసి రాబోయే విధ్వంసం ఎలా ఉండబోతోందో చిన్న శాంపిల్ గా చూపిస్తోంది.

ఇదే కాదు ఓజి వేర్ పేరుతో ప్రత్యేకంగా తయారు చేయించిన టి షర్టులు అమ్మకానికి పెడితే వాటిని హాట్ కేకుల్లా కొనేసుకుంటున్నారు. నిన్న సేల్స్ మొదలుపెట్టిన పదిహేను నిమిషాలకే రెండు వేలకు పైగా చొక్కాలు అమ్ముడుపోవడం విశేషం. అలాని ఇదేదో రెండు మూడు వందలకు అమ్మిన సరుకు కాదు. ఒక్కొక్కటి 800 తో మొదలుపెట్టి 1900 రూపాయల దాకా ఉన్నాయి. అయినా సరే ఫాన్స్ లెక్క చేయకుండా వాటిని స్వంతం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి హుడీలతో పాటు టోపీలు, కీ చైన్లు, హెయిర్ బ్యాండ్లు, చైన్లు ఇలా రకరకాల ఉత్పత్తులను ఓజి పేరుతో తీసుకురాబోతున్నారు.

ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏపీ తెలంగాణ బుకింగ్స్ మొదలుపెడితే జరగబోయే అరాచకం ఊహించుకోమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఊరిస్తున్నారు. బజ్ లేని హరిహర వీరమల్లునే కొన్ని చోట్ల ఓపెనింగ్ డే రికార్డు పెట్టింది. బెనిఫిట్ షో ఆరు వందల రూపాయలు పెట్టినా హౌస్ ఫుల్స్ పడ్డాయి. అలాంటిది ఓజి బ్యాటింగ్ ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. తమిళంలో రజనీకాంత్ తరహాలో మన తెలుగు కంపెనీల ఉద్యోగులు కూడా సెప్టెంబర్ 25 సెలవు ప్రకటించాలని డిమాండ్ చేసేలా ఉన్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజికి తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకం కాబోతున్నాయి.