అనుష్క దర్శనానికి వేళాయెరా

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత దర్శనం లేకుండా పోయిన అనుష్క సెప్టెంబర్ 5 విడుదల కాబోయే ఘాటీ ప్రమోషన్ల కోసం బయటికి వస్తుందని లేటెస్ట్ అప్డేట్. అయితే మీడియాకు నేరుగా కలుసుకుంటుందన్న గ్యారెంటీ లేదు కానీ విడిగా రికార్డు చేసిన ఇంటర్వ్యూలలో కనిపిస్తుందని సమాచారం. ఘాటీ సక్సెస్ తనకు చాలా కీలకం. మొదటిసారి గంజాయి అమ్మే లేడీ డాన్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. గతంలో అరుంధతి లాంటి పాత్రలు చేసినప్పటికీ ఇది స్పెషల్ కానుంది. ఒకరకంగా చెప్పాలంటే పుష్పకు ఫిమేల్ వెర్షన్ లా ఉంటుంది ఈ ఘాటీ. దర్శకుడు క్రిష్ దీని విజయం కోసం బాగా కష్టపడ్డారు.

ఇక బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ పబ్లిసిటీ ఏదో కొత్త సినిమా వస్తుందనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. స్వయంగా రాజమౌళినే రంగంలోకి దిగబోతున్నారు. అక్టోబర్ లో దీని ప్లానింగ్ ఉంటుంది. రిలీజ్ 31 కాబట్టి దానికి రెండు వారాల ముందు ప్రమోషన్స్ ని పీక్స్ కు తీసుకెళ్తారు. ప్రభాస్, అనుష్క ఒకేసారి కలిసి కెమెరా ముందుకు రాబోతున్నట్టు లీక్ ఉంది. అయితే షూటింగులకు తప్ప కనీసం బయట కనిపించడం మానేసిన అనుష్క లైవ్ లో ఎలా ఉంటుందనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఘాటీకి బిజినెస్ జరుగుతోందంటే దానికి ప్రధాన కారణం ఆమె ఇమేజ్. తర్వాతే క్రిష్ బ్రాండ్.

అనుష్క నటించిన మరో మలయాళ మూవీ కథనర్ సైతం వాయిదాల పర్వంలో ఆలస్యమవుతూ వస్తోంది. ఇది పీరియాడిక్ డ్రామా. పెద్ద బడ్జెట్ తో ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ ఏడాది విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ నిర్మాతల వైపు నుంచి ఏవో ఆర్థిక చిక్కుల వల్ల లేట్ అవుతోందని మల్లువుడ్ టాక్. ఘాటీ, కథానర్ తర్వాత అనుష్క ఇంకే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకరిద్దరు కథలతో ఒప్పించారు కానీ అవి సెట్స్ పైకి వెళ్లలేకపోయాయి. నలభై వచ్చినా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్న అనుష్కను నిజ జీవితంలో పెళ్లి కూతురిగా చూడాలనే ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు తీరుతుందో.