అమరన్ చేతిలో మురుగదాస్ తుపాకీ

ఒకప్పుడు గజిని లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ తో సినీ ప్రియుల్లో అశేష అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా కాలంగా ఫామ్ లో లేరు. సల్మాన్ ఖాన్ సికందర్ దారుణంగా డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ ఊహించలేదు. దానికి రకరకాల కారణాలు చెప్పుకుని, తప్పుని కండల వీరుడి మీదకు తోసేశాడు కానీ బేసిక్ గా కథా కథనాలు అత్తెసరుగా ఉన్నాయనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో రూపొందిన మదరాసి సెప్టెంబర్ 5 విడుదల కాబోతోంది. అమరన్ తర్వాత శివ కార్తికేయన్ నటించిన మూవీ కావడంతో బిజినెస్, అంచనాల పరంగా మంచి క్రేజ్ నెలకొంది.

స్టోరీగా చూస్తే మదరాసి కొంచెం డిఫరెంట్ గానే కనిపిస్తోంది. హీరోకో జబ్బు ఉంటుంది. దీనికి తోడు అంతులేని ఆవేశంతో ఏదైనా అన్యాయం జరిగితే విపరీతంగా తిరగబడతాడు. వేలాది మారణాయుధాలతో ఒక తీవ్రవాద ముఠా తమిళనాడులోని ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు శాయశక్తులా కృషి చేస్తారు. కానీ అది సరిపోక హీరోనే రంగంలోకి దిగాల్సి వస్తుంది. అసలు మదరాసి సమస్య ఏమిటి, దానికి టెర్రరిస్టులతో ముడి ఏమిటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో శివ కార్తికేయన్ కు మంచి ఎలివేషన్లు పడ్డాయి.

కంటెంట్ పరంగా చూస్తే అమరన్ చేతికి మురుగదాస్ తుపాకీ ఇచ్చినట్టు అయ్యింది. విలన్ విద్యుత్ జమాల్ తో ఆ టైపులో ఒక డైలాగు కూడా చెప్పించారు. అమాంతం అంచనాలు పెంచేలా ట్రైలర్ లేదు కానీ యాక్షన్ విజువల్స్ ని బట్టి మాస్, క్లాస్ ని టార్గెట్ చేసిన వైనం కనిపిస్తోంది. సప్త సాగరాలు దాటి తర్వాత హిట్టు లేని రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటించింది. తెలుగులో అదే టైటిల్ తో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. మన దగ్గర అనుష్క ఘాటీ, మౌళి లిటిల్ హార్ట్స్ తో మదరాసికి పోటీ ఉండనుంది. మరి శివ కార్తికేయన్ మరో హిట్ అందుకుంటాడో లేక దాస్ తో షాక్ తింటాడో లెట్ వెయిట్ అండ్ సీ.