తెలుగు సినిమా చరిత్రలోనే బెస్ట్ కమెడియన్ల లిస్టు తీస్తే అందులో ముందు వరుసలో ఉండే పేరు.. సునీల్. 2000 తర్వాత అతను కొన్నేళ్ల పాటు తెలుగు తెరను ఏలాడు. ఒక దశలో బ్రహ్మానందంను కూడా వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కూడా ఆక్రమించాడు. నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, సొంతం సహా పలు చిత్రాల్లో అతడి కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో తెర మీద సునీల్ కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పులుముకునేవి.
కామెడీ టైమింగ్ విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్న నటుడతను. అలాంటి కమెడియన్ తర్వాతి రోజుల్లో సీరియస్ విలన్ పాత్రలు పోషిస్తాడని.. ప్రేక్షకులను భయపెడతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. విలన్లుగా మొదలుపెట్టి కమెడియన్లు అయిన వాళ్లు చాలామందే ఉన్నారు కానీ.. ఇలా కామెడీతో మొదలుపెట్టి విలన్‌గా స్థిరపడ్డ నటులు అరుదనే చెప్పాలి. ‘కలర్ ఫొటో’, ‘పుష్ప-2’ సహా పలు చిత్రాల్లో విలన్ పాత్రల్లో ఆకట్టుకున్నాడు సునీల్.
ఇప్పుడు సునీల్ విలనీలో వేరే లెవెల్‌కు వెళ్లిపోయాడు. అతను ఓ చిత్రంలో సీరియల్ కిల్లర్ పాత్ర పోషించడం.. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడం విశేషం. తమిళంలో తెరకెక్కిన ఆ చిత్రమే.. ఇంద్ర. ‘జైలర్’ సినిమాలో రజినీకాంత్ కొడుకు పాత్రలో నటించి మెప్పించిన వసంత్ రవి ఇందులో హీరో. పలు తెలుగు చిత్రాల్లో కథానాయికగా చేసిన మెహ్రీన్ పిర్జాదా ఈ చిత్రంలో అతడికి జోడీగా నటించింది. ఇందులో సునీలే విలన్ పాత్ర చేశాడు.
అతడిది సీరియల్ కిల్లర్ పాత్ర కావడం విశేషం. చాలా పద్ధతిగా కనిపిస్తూనే కిరాతకంగా మహిళలను హత్య చేసే అభిమన్యు అనే పాత్రలో నటించాడు సునీల్. సస్పెండైన పోలీస్ పాత్రలో నటించిన హీరో.. తన భార్యను చంపిన కిల్లర్‌ను వెతికి ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సునీల్ పాత్రకు, అతడి నటనకు తమిళనాట మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే తమిళంలో పలు చిత్రాల్లో నటించిన సునీల్.. ఈ చిత్రంతో ఇంకా బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates