వెబ్ సిరీస్ హింసకు అడ్డుకట్ట వేయాల్సిందే

కరోనా వచ్చాక ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో వచ్చిన అతి ముఖ్యమైన మార్పుల్లో ఓటిటి విప్లవం ఒకటి. అప్పటిదాకా భారతీయ ప్రేక్షకులకు అలవాటు లేని వెబ్ సిరీస్ కల్చర్ ఇక్కడి నుంచే ఉధృతంగా మొదలయ్యింది. క్రైమ్, సైకో కిల్లింగ్, హారర్, వయొలెన్స్ ఈ నాలుగు ప్రధానాంశాలుగా గత నాలుగేళ్ళలో ఎన్ని వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. అయితే సెన్సార్ లేని కారణంగా విచ్చలవిడితనం వీటిలో రాజ్యమేలింది. నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ బోల్డ్ నెస్ ఉంటేనే జనాలు ఆదరిస్తారనే కండీషన్ తో ఎందరో దర్శకులను ప్రభావితం చేసి ఓవర్ అడల్ట్ కంటెంట్ తీసేలా ప్రేరేపించాయి.

ఇదంతా ఇప్పుడు డిస్కషన్ కు రావడానికి కారణం ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన హత్యలు. ఓ పదో తరగతి కుర్రాడు చిన్న పాపను కత్తితో హత్య చేయడం చూసి సమాజం నివ్వెరపోయింది. ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే ఓటిటిలో క్రైమ్, కిల్లర్ కథలు చూసి నేర్చుకున్నానని పోలీసులతో చెప్పాడు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ వాటిలో పిల్లల ప్రమేయం లేదు. కానీ ఇప్పుడు జరిగిన దారుణం చాలా తీవ్రమైంది. తల్లితండ్రులు భయంతో వణికిపోయే ఘోరం. అంటే వెబ్ సిరీస్ లకు అడ్డుకట్ట లేకపోవడం పసి మనసులను ఎంత ప్రభావితం చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

సైకో కిల్లర్ కథల పేరుతో హత్యలను మరీ క్రూరంగా చూపించడాన్ని సహజత్వం పేరుతో కవర్ చేసుకోవడం ఇప్పటి దర్శకులు చేస్తున్న తీవ్రమైన తప్పు. డబ్బులు వ్యూస్ వస్తున్నాయి సరే వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఆలోచించుకోవాలి. స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్ లాంటి వాటితో ఇబ్బంది లేదు. కానీ మీర్జాపూర్ లాంటివి బూతులు, కత్తులు కటార్లతో నిండిపోయి మెదళ్లను వయొలెన్స్ తో నింపేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం వీటి తాకిడి తగ్గింది కానీ ప్రభుత్వాలు సీరియస్ గా ఆలోచించి వీటికి ఎలా నియంత్రించాలనే దాని మీద ఒక కార్యచరణ రూపొందిస్తే మంచిది. ఇప్పుడు జరుగుతున్న నష్టం ఇంకా ప్రాధమిక స్టేజిలోనే ఉంది.