కూలీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడటం లేదనే విషయాన్ని కాసేపు పక్కనపెడితే ఈ సినిమా వల్ల ఎక్కువ ప్రయోజనం దక్కించుకున్న వాళ్లలో ఇద్దరున్నారు. మొదటిగా చెప్పాల్సిన పేరు రచిత రామ్. ఏ మాత్రం ఊహలకు అందకుండా, అనుమానం రాకుండా అండర్ ప్లే చేస్తూ పోషించిన లేడీ విలన్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా పేలింది. ఆమె మీద మీమ్స్ గట్రా సోషల్ మీడియాలో గట్టిగానే తిరిగాయి. సౌబిన్ సాహిర్ కు ధీటుగా రచిత రామ్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ కూలీకి చాలా ప్లస్ అయిన మాట వాస్తవం. అయితే ఈ ఎఫెక్ట్ ఎంత బలంగా ఉందంటే ఐఎండిబి ర్యాంకుల్లో పైకి ఎగబాకి ఆశ్చర్యం కలిగించేంత.
కూలికి ముందు వరకు ఐఎండిబిలో రచిత రామ్ కు ఉన్న ర్యాంక్ 392. ఇప్పుడీ సినిమా వచ్చాక ఏకంగా 37కి చేరుకుంది. అంటే 250 సెలెబ్రిటీలను దాటుకుని ఈ స్టేజికి వచ్చిందన్న మాట. విచిత్రంగా శృతి హాసన్ నెంబర్ 44 కావడం గమనించాల్సిన విషయం. రచిత రామ్ కు ఇంత పాపులారిటీ అనూహ్యంగా పెరగడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఆ మధ్య కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చితో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు దాని డిజాస్టర్ ఫలితం ప్రతికూలంగా పని చేసింది. కన్నడలో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన టైంలో కూలి రూపంలో పెద్ద బ్రేక్ దొరికి అవకాశాలు వచ్చేలా చేసింది.
అయితే ఇకపై అలాంటి పాత్రలు చేస్తుందా లేదానేది వేచి చూడాల్సి ఉంది. ఒకప్పుడు దర్శన్ , సుదీప్, ఉపేంద్రలతో హీరోయిన్ గా నటించిన రచిత రామ్ ఆ మధ్య సపోర్టింగ్ రోల్స్ ఎన్ని వచ్చినా ఓకే చెప్పలేదట. కేవలం రజనీకాంత్ సినిమా అనే ఒకే కారణంతో దీనికి ఒప్పుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సంగతలా ఉంచితే అయిదు వందల కోట్ల గ్రాస్ కు దగ్గరలో ఉన్న కూలీ తమిళంలో హిట్టుగానే పరిగణిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆశించిన విజయం సాధించలేకపోయింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కున్న బ్రాండ్ ని కూలీ కొంతమేరకు తగ్గించిందనేది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates