నిన్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు కీలక అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. భోళా శంకర్ తర్వాత వచ్చిన రెండేళ్ల గ్యాప్ కు న్యాయం చేకూరేలా చిరు చేసుకున్న లైనప్ సరైన ప్రణాళికతో ఉంది. అయితే దీన్ని సరిగా అర్థం చేసుకోలేని కొన్ని సోషల్ మీడియా వర్గాలు ఏది ముందు పూర్తవుతుంది, ఏది రిలీజవుతుందనే దాని మీద అవసరం లేని అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాబీ అనౌన్స్ మెంట్ ని చూపించి దానికి తెరతీశారు. మొత్తం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే చిరు ఎలాంటి ప్లానింగ్ తో ఉన్నారో ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది.
అనిల్ రావిపూడితో చేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ ఫెడరేషన్ సమ్మె వల్ల కొంత ఎఫెక్ట్ అయినా మరీ ఇబ్బంది కలగకుండా కొత్త షెడ్యూల్స్ ఆఘమేఘాల మీద ప్లాన్ చేస్తున్నారు. ఇంకో నెలలో వెంకటేష్ కూడా జాయినవుతారు. సంక్రాంతి 2026ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే ప్రసక్తే ఉండదు. ‘విశ్వంభర’ షూట్ మొత్తం పూర్తయిపోయింది. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసమే పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దర్శకుడు వశిష్ఠ టాప్ క్లాస్ గ్రాఫిక్స్ కోసం టీమ్ మొత్తాన్ని సమాయత్తం చేస్తున్నాడు. మెగా సెంటిమెంట్ డేట్ మే 9 రిలీజ్ పక్కాని ఇన్ సైడ్ టాక్. కాకపోతే ప్రకటన ఇప్పుడప్పుడే ఇవ్వరు.
అంటే జనవరి నుంచి చిరంజీవి ఫ్రీ అయిపోతారు కాబట్టి వెంటనే బాబీ డైరెక్షన్లో ‘మెగా 158’ సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. గత ఆరేడు నెలలుగా బాబీ దీనిమీదే సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. విశ్వంభర రిలీజయ్యే నాటికి ఈ సినిమా షూట్ దాదాపు కొలిక్కి వచ్చేస్తుంది. ఆలోగా శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ విడుదలైపోయి ఉంటుంది. తను వెంటనే మెగా బ్లడ్ బాత్ స్క్రిప్ట్ చేతుల్లోకి తీసుకుంటాడు. ఎలాగూ 2026 లో రెండు రిలీజులు జరిగి ఉంటాయి కాబట్టి చిరంజీవి కొంత విశ్రాంతి తీసుకుని ఓదెలతో చేతులు కలుపుతారు. సింపుల్ గా చెప్పాలంటే మన శంకరవరప్రసాద్ గారు, విశ్వంభర, బాబీ మెగా 158, శ్రీకాంత్ ఓదెల మెగా 159. ఇదండీ లైనప్.
Gulte Telugu Telugu Political and Movie News Updates