నిజమా.. పవన్ సరసన ఆ హీరోయినా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసబెట్టి సినిమాలు ప్రకటించడం.. అందులో రెండు చిత్రీకరణ దశలో ఉండటం తెలిసిన సంగతే. ‘వకీల్ సాబ్’ షూటింగ్ చివరి దశలో ఉండగా.. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం కొన్ని రోజులు పని చేశాడు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. షూటింగ్ పున:ప్రారంభం కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది.

ఐతే సినిమా మొదలై ఒకట్రెండు షెడ్యూళ్లు అయ్యాక కూడా ఇందులో కథానాయిక ఎవరన్న దానిపై స్పష్టత లేకపోయింది. కానీ ఇప్పుడు ఇందులో పవన్ సరసన ఓ యంగ్ హీరోయిన్ నటిస్తోందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి క్రేజ్ సంపాదించిన నిధి అగర్వాల్.

ఆమె పవన్-క్రిష్ సినిమాలో కథానాయిక అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని గంటల నుంచి గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ అప్‌డేట్‌తో కూడిన హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో కథానాయిక అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ.. పవన్ సరసన నిధి అనగానే జనాలకు ఏదోలా అనిపిస్తోంది. పవన్ పక్కన ఆమె మరీ చిన్నదిగా అనిపిస్తుందేమో అన్నది చాలామంది ఫీలింగ్.

ఇప్పటిదాకా నిధి కూడా యంగ్ హీరోల పక్కనే కనిపిస్తోంది. గ్లామర్‌తోనే ఇప్పటిదాకా పేరు సంపాదించిన నిధికి క్రిష్ సినిమాలో నటించేంత టాలెంట్ ఉందా అన్న సందేహం కూడా కలగక మానదు. అందుకే పవన్-క్రిష్ సినిమాలో నిధి కథానాయిక అనే అప్ డేట్‌పై చాలామంది నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. మరి ఈ చిత్రంలో ఆమె నిజంగానే కథానాయికగా కనిపించనుందా.. ఇది కేవలం రూమరా అన్నది చూడాలి.

పవన్ ఈ సినిమా చిత్రీకరణకు అనుకున్న సమయానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో క్రిష్ మధ్యలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)