నాగ్‌ను చూసి వాళ్లు ఊగిపోతున్నారు

టాలీవుడ్లో నిన్నటి తరం హీరోల్లో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు అంటే అక్కినేని నాగార్జున పేరే చెప్పేవాళ్లు. నాగ్‌కు భారీగా లేడీ ఫ్యాన్స్ ఉండడానికి ఆయన గ్లామరే కారణం. ‘మన్మథుడు’ సహా ఎన్నో చిత్రాల్లో తన గ్లామర్‌తో ఆయన అభిమానులను కట్టిపడేశాడు. ఐతే గత కొన్నేళ్లలో యంగ్ హీరోల జోరు ముందు ఆయన కొంచెం వెనుకబడ్డారు. తెలుగులో కెరీర్ ఏమంత గొప్పగా లేదు. ఐతే ఈ ఏడాది ఆయన ‘కుబేర’ చిత్రంలో ప్రత్యేక పాత్రతో ఆకట్టుకుని.. తాజాగా ‘కూలీ’ చిత్రంలో విలన్ పాత్ర పోషించి ఆశ్చర్యపరిచారు.

ఐతే రిలీజ్ ముంగిట నాగ్ చేసిన సైమన్ పాత్ర గురించి టీం అంతా తెగ ఊదరగొట్టింది కానీ.. సినిమా చూసిన వాళ్లంతా ఆ క్యారెక్టర్ విషయంలో పెదవి విరిచారు. ఆ పాత్రలో బిల్డప్ తప్ప కంటెంట్ లేకపోయింది. నాగ్ ఈ పాత్ర విషయంలో అంతగా ఎందుకు ఎగ్జైట్ అయ్యాడో అనే సందేహాలు కలిగాయి. ఐతే తెలుగులో నాగ్ ఫ్యాన్స్ సహా అందరూ సైమన్ పాత్ర విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయగా.. తమిళ జనాల ఫీలింగ్ మాత్రం వేరేలా ఉంది. క్యారెక్టర్లో బలం లేకపోయినా.. నాగ్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు అక్కడి వాళ్లు ముగ్ధులైపోతున్నారు.

సోషల్ మీడియాలో నాగార్జునకు అక్కడి వాళ్లు మామూలు ఎలివేషన్ ఇవ్వట్లేదు. 65 ఏళ్ల వయసులో ఈ స్వాగ్ ఏంటి అంటూ నాగ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత స్టైష్ విలన్ని తాము ఇంతవరకు చూడలేదంటున్నారు. ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలు నాగ్ గ్లామర్‌కు ఫిదా అయిపోయి.. రీల్స్, షార్ట్స్‌లో ఆయన మీద తమ ప్రేమను చూపిస్తున్నారు.

విశేషం ఏంటంటే.. తమిళనాట ఒక థియేటర్లో ‘కూలీ’ ఇంటర్వెల్లో ‘రక్షకుడు’ సినిమా నుంచి ‘సోనియా సోనియా’ పాటను ప్లే చేస్తే ఆడియన్స్ దానికి స్టెప్పులు వేశారు. ఇది నాగ్ క్రేజ్‌కు నిదర్శనం. నాగ్ గ్లామర్ గురించి మనవాళ్లకు తెలియంది కాదు కాబట్టి.. సైమన్ పాత్రలో ఆయన్ని చూసి మన వాళ్లు ఎగ్జైట్ కాలేదు కానీ, తమిళులను మాత్రం ఆయన బాగానే ఆశ్చర్యపరిచినట్లున్నారు.