బొమ్మలా మారడం వెనుక కారణమేంటి

స్టార్ హీరోలు ఓపెన్ గా ఉండటం అన్ని సందర్భాల్లో కుదరదు. ఫ్యాన్స్ కోసమో లేక ఈగోల కోసమో కొన్నిసార్లు అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. కానీ నాగార్జున ఫిల్టర్ లేకుండా చెప్పే కొన్ని విషయాలు ఇతర అభిమానులను కూడా ఆకట్టుకుంటాయి. ఇటీవలే జగపతిబాబు నిర్వహిస్తున్న టాక్ షోకు గెస్టుగా వచ్చిన నాగ్ ఒక పాత ముచ్చటని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో నాగార్జున చేసిన సినిమాల్లో ఆఖరి పోరాటం కమర్షియల్ గా పెద్ద హిట్టు. 1988లో రిలీజైన ఈ యాక్షన్ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ఇళయరాజా అదిరిపోయే సంగీతం సమకూర్చారు. అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఆఖరి పోరాటం విజయం శ్రీదేవి, రాఘవేంద్రరావు వల్లే సాధ్యమయ్యిందని, తానొక బొమ్మలా నిలబడ్డానని అన్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే ఆ టైంలో నాగ్ ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు. మజ్ను విజయం సాధించినప్పటికీ తన స్టామినా ఏంటో సగటు ప్రేక్షకులకు తెలియలేదు. అక్కినేని అబ్బాయిగానే చూస్తున్నారు. ఆఖరి పోరాటం బిజినెస్ క్రేజీగా జరగడంలో ముందు పని చేసింది శ్రీదేవి ఇమేజే. పాత్ర పరంగా డామినేషన్ తనదే ఉంటుంది. పాటలు, క్లైమాక్స్ ఇలా ముఖ్యమైన ఘట్టాల్లో ఆమెకు బోలెడు ట్విస్టులు పెట్టారు రచయిత యండమూరి, దర్శకుడు రాఘవేంద్రరావు.

కంటెంట్ వర్కౌట్ కావడంతో ఆఖరి పోరాటం సూపర్ హిట్టయ్యింది. అయితే నాగార్జునకు తొలి బ్రేక్ వచ్చింది మాత్రం శివతోనే. అప్పుడు ఎవరి మద్దతు అవసరం పడలేదు. మణిరత్నం వెంటపడి మరీ గీతాంజలి చేయించుకున్న నాగార్జున దాని రూపంలో ఎప్పటికీ మర్చిపోలేని కల్ట్ క్లాసిక్ అందుకున్నారు. సోషల్ మీడియాలో తరచు ఈ ఆఖరి పోరాటం సినిమా మీద వెంకటేష్, నాగార్జున ఫ్యాన్స్ మధ్య డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు స్వయంగా కింగే దానికి స్పష్టత ఇవ్వడంతో వాటికి చెక్ పడిపోయినట్టే. అన్నట్టు ఈ సినిమాని రీ రిలీజ్ చెయ్యమని అభిమానులు అడుగుతున్నారట. చూడాలి ఏం చేస్తారో.