క్వాలిటీ CG ఉంటేనే విశ్వంభర వస్తాడు

ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు వస్తోంది. సోషల్ మీడియాలో, బయట హంగామా చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు,. 70వ బర్త్ డే కావడంతో మెగాస్టార్ ప్రత్యేకమైన ప్లానింగ్ లో ఉన్నారని, బహుశా హైదరాబాద్ లో ఉండకపోవచ్చని తాజా అప్డేట్. ఇదిలా ఉండగా విశ్వంభర నుంచి ఏదైనా ప్రామిసింగ్ కంటెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత ఆగస్ట్ 22 వచ్చిన టీజర్ తీవ్ర విమర్శలు తెచ్చుకుని ఏకంగా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ చేసింది. విఎఫ్ఎక్స్ కోసం టీమ్ ని మార్చేలా చేసింది. రిలీజ్ డేట్ పక్కన పెట్టి గ్రాఫిక్స్ క్వాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రేరేపించింది. ఇప్పుడు ఫ్రెష్ విజువల్స్ చేతికి వస్తున్నాయి.

వంద శాతం కొత్త టీజర్ పట్ల సంతృప్తి అనిపిస్తేనే వీడియో వదలాలని యువి క్రియేషన్స్, దర్శకుడు వశిష్ఠతో పాటు చిరు కూడా అదే నిర్ణయంతో ఉన్నారట. అసలే ఆన్ లైన్ లో ట్రోలింగ్ బ్యాచులు చాలా యాక్టివ్ గా ఉన్నాయి. వార్ 2 విషయంలో జరగాల్సిన దాని కన్నా పెద్ద డ్యామేజ్ ఎక్స్, ఇన్స్ టాలో జరిగింది. ఇప్పుడు విశ్వంభర కనక ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయినా అవన్నీ యాక్టివ్ అవుతాయి. మళ్ళీ చిరంజీవి మూవీని టార్గెట్ గా చేసుకుంటాయి. అందుకే ప్రతి ఒక్క ఫ్రేమ్ ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్నకే రిలీజ్ చేయాలని, లేదంటే పోస్టర్ తో సరిపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతానికి విడుదల తేదీ పెండింగ్ లోనే ఉంది. అక్టోబర్ ఆప్షన్లు చూస్తున్నారు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్న కంపెనీలు అప్పటికంతా కంటెంట్ డెలివరీ ఇవ్వగలరా లేదానే దాని మీద రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది. అందుకే ఎంత ఒత్తిడి ఉన్నా విశ్వంభర బృందం మౌనంగానే ఉంది. బేబీ దర్శకుడు సాయి రాజేష్ ఇటీవలే విశ్వంభర కొత్త టీజర్ చూసి అదిరిపోయిందని స్టేటస్ పెట్టడం ఫ్యాన్స్ లో ఆశలు పెంచింది. ఏది ఏమైనా క్వాలీటీ ఉంటేనే విశ్వంభర పబ్లిసిటీ వదలాలని ఫ్యాన్స్ డిమాండ్. ఇన్ సైడ్ టాక్ అయితే ఖచ్చితంగా కొత్త టీజర్ వస్తుందని ఉంది. చూడాలి మరి ఈసారి ఎలా మెప్పించబోతున్నారో.