టాలీవుడ్లో మరే నిర్మాతకూ సాధ్యం కాని సక్సెస్ రేట్‌తో దూసుకెళ్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు సూర్యదేవర నాగవంశీ. అతడి బేనర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఓ సినిమా వస్తోందంటే.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు నమ్మకంతో థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనిపించింది. అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం వంశీని చూస్తే ఒకప్పటి తనను చూసుకున్నట్లు అనిపిస్తోందని.. అంత బాగా సినిమాలు తీస్తున్నాడని ఓ సందర్భంలో ప్రశంసలు కురిపించడం విశేషం.
వంశీ ప్రొడ్యూస్ చేసే సినిమాలతో పాటు అతను డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలకూ మంచి ఫలితాలు అందుకోవడంతో టాలీవుడ్లో గోల్డెన్ హ్యాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడతను. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సక్సెస్‌లతో కొనసాగడం కష్టం కాదు. సినీ నిర్మాణం జూదంలా మారిపోయిన ఈ రోజుల్లో జాతకాలు తిరగబడడానికి ఎంతో సమయం పట్టదు. అందుకు నాగవంశీ కూడా మినహాయింపు కాలేకపోతున్నాడు.
జులై నెలాఖరు నుంచి నెల రోజుల వ్యవధిలో మూడు క్రేజీ చిత్రాల విడుదల పెట్టుకున్నాడు నాగవంశీ. ఈ మూడు చిత్రాల తనకు మంచి ఫలితాలనిచ్చి ఇండస్ట్రీలో తన పేరు మార్మోగేలా చేస్తాయని ఆశించాడు. కానీ ఒక్కో సినిమా ఆయన్ని కిందికి లాగేస్తోంది. ముందుగా విజయ్ దేవరకొండతో భారీ బడ్జెట్ పెట్టి తీసిన ‘కింగ్డమ్’ నాగవంశీని గట్టి దెబ్బ కొట్టింది. వీకెండ్ వరకు ఓకే అనిపించిన ఈ చిత్రం.. తర్వాత క్రాష్ అయిపోయింది. విజయ్ గత చిత్రాలతో పోలిస్తే ఇది బాగా ఆడినా.. నష్టాలు విషయంలో మాత్రం ఇదేమీ తక్కువ కాదు. ఎక్కువ బడ్జెట్ పెట్టడం వల్ల నష్టాలు ఎక్కువే వచ్చాయి.
ఐతే ఆ నష్టాలను ఎన్టీఆర్ సినిమా ‘వార్-2’ భర్తీ చేస్తుందనుకుంటే.. ఇది ఇంకా పెద్ద దెబ్బ కొట్టేలా ఉంది. ఏకంగా రూ.80 కోట్లు పెట్టి తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాడు నాగవంశీ. కానీ ‘కూలీ’తో పోటీలో ఈ సినిమా రిలీజ్ ముంగిటే వెనుకబడిపోయింది. పైగా బ్యాడ్ టాక్ రావడంతో వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేవు. పెట్టుబడిలో సగం వెనక్కి రావడం కూడా కష్టంగా ఉంది. వీకెండ్ తర్వాత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండబోతోందన్నది స్పష్టం. మరోవైపు రవితేజ సినిమా ‘మాస్ జాతర’ మీద ఉన్న అంచనాలు టీజర్ తర్వాత తగ్గిపోయాయి. దీంతో ఈ నెల 27న సినిమాను రిలీజ్ చేయట్లేదని, వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్, వేసవిలో మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో హిట్లు కొట్టి ఖుషీగా ఉన్న నాగవంశీ.. ఇంతలోనే వరుస ఎదురుదెబ్బలతో కుదేలైపోయైపోయే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates