మన దగ్గర ఒకప్పుడు సినిమా రిలీజ్ ముంగిట ఆడియో వేడుకలు ఉండేవి. తర్వాత అవి ప్రి రిలీజ్ ఈవెంట్లుగా రూపాంతరం చెందాయి. ఐతే తమిళంలో మాత్రం ఇప్పటికీ ఆడియో వేడుకలే చేస్తున్నారు. ఐతే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం కూలీకి మాత్రం కొంచెం భిన్నంగా ఈవెంట్ చేశారు. కూలీ అన్‌లీష్డ్ పేరుతో జరిగిన ఈ ఈవెంట్.. ఆడియో వేడుకకు కొంచెం భిన్నంగా, ఇంకా భారీగా జరిగింది. ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ ఎప్పట్లాగే ఈ ఈవెంట్‌కు యూట్యూబ్ లైవ్ ఇవ్వలేదు. వేరే ఛానెళ్లకూ ఫీడ్ ఇవ్వలేదు. తమ సన్ టీవీ ఛానెల్లో ఎక్స్‌క్లూజివ్‌గా దీన్ని ప్రసారం చేశారు.
విశేషం ఏంటంటే.. కూలీ ఈవెంట్ తెలుగులో సైతం ప్రసారం కాబోతోంది. ఇందుకు ఆగస్టు 15న రాత్రి 9.30 గంటలను ముహూర్తం పెట్టారు.. సన్ నెట్‌వర్క్‌లో భాగమైన జెమినీ టీవీలో ఈ ఈవెంట్ ప్రసారం కాబోతోంది. తమిళ సినిమాలకు తెలుగులో చిన్న ఈవెంట్ చేయడం, ప్రెస్ మీట్‌లు పెట్టడం మామూలే కానీ… ఇలా చెన్నైలో తమిళంలో జరిగిన ఈవెంట్‌ను తెలుగులో ప్రసారం చేయడం మాత్రం అరుదనే చెప్పాలి. బహుశా ఇలా చేస్తుండం తొలిసారి కూడా కావచ్చు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తమిళంలో పెర్ఫామ్ చేసిన పాటల బదులు కూలీ తెలుగు సాంగ్స్ వినిపించనున్నారు. అలాగే స్పీచ్‌లకు తెలుగు వాయిస్ ఓవర్ చేయిస్తున్నారు.
ఇప్పటిదాకా తమిళ సినిమాలను డబ్ చేయడం చూశాం కానీ.. ఇప్పుడు ఈవెంట్లను కూడా అనువాదం చేస్తున్నారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కూలీ తెలుగు ప్రమోషన్ల మీద టీం పెడుతున్న శ్రద్ధకు ఇది నిదర్శనం కావచ్చు. ఐతే ఇంత చేస్తున్నారు బాగుంది కానీ.. రజినీని హైదరాబాద్‌కు రప్పించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు కూలీ సినిమాకు బంపర్ హైప్ వచ్చింది. రజినీ సినిమాలకు మామూలుగానే ఇక్కడ క్రేజ్ ఉంటుంది కానీ.. లోకేష్ కనకరాజ్ డైరెక్షణ్, నాగ్ విలన్ పాత్ర చేయడం, ఉపేంద్ర ప్రత్యేక పాత్ర పోషించడం దీనికి అదనపు ఆకర్షణలయ్యాయి. ఆగస్టు 14న వార్-2తో పాటుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates