లండన్‌లో ‘బిగ్ బ్రదర్’ పేరుతో మొదలై రియాలిటీ టీవీ షో.. ఆ తర్వాత హిందీలో ‘బిగ్ బాస్’ పేరుతో అరంగేట్రం చేసి.. ఆపై సౌత్ భాషల్లోకి కూడా అడుగు పెట్టింది. తెలుగులో ఇప్పటికే 8 సీజన్ల పాటు అలరించిన ఈ షో.. తొమ్మిదో సీజన్‌తో పలకరించబోతోంది. గత ఆరు సీజన్లలో షోను నడిపించిన అక్కినేని నాగార్జుననే ఈ సీజన్లో కూడా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. త్వరలోనే కంటెస్టెంట్లను ప్రకటించనుండగా.. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో వదిలారు.
అందులో నాగ్‌తో పాటు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా కనిపించడం విశేషం. తాను కూడా షోలో పాల్గొనాలని కిషోర్ ఉత్సాహంగా వస్తే.. అతడికి షాకుల మీద షాకులు ఇచ్చాడు నాగ్. ఇప్పటిదాకా జరిగిన సీజన్లన్నింటితో పోలిస్తే బిగ్ బాస్-9 చాలా భిన్నంగా ఉండబోతోందని ఈ ప్రోమోతో సంకేతాలు ఇచ్చారు. ఇది డ్రీమ్ హౌస్ కావచ్చు కానీ, సేమ్ హౌసే కదా అని కిషోర్ అంటే.. ‘‘నాట్ ఎనీ మోర్.. ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్’’ అని నాగ్ పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఈసారి షోలో రెండు హౌస్‌లు ఉంటాయని అర్థమవుతోంది.
ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగి.. చివరికి ‘‘నేను డైరెక్ట్‌గా బిగ్ బాస్‌తోనే మాట్లాడుకుంటా’’ అని కిషోర్ అంటే.. ‘‘ఈసారి బిగ్ బాస్‌నే మార్చేశాం.. అందరి సరదాలు తీరిపోతాయి.. ఈసారి చదరంగం కాదు రణరంగమే’’ అని నాగ్ అనడంతో ప్రోమో ముగిసింది. ఇందులో ‘‘బిగ్ బాస్‌నే మార్చేశాం’’ అనే మాట ఆసక్తి రేకెత్తిస్తోంది. అంటే ‘బిగ్ బాస్’ కొత్త వాయిస్‌తో వినిపించనుందా.. లేక ఇంకేదైనా మార్పు చేశారా అన్నది ప్రశ్న. ఈసారి షోలో సెలబ్రెటీల కంటే సామాన్యులే ఎక్కువమంది ఉంటారని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ‘బిగ్ బాస్-9’ వచ్చే నెల నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates