తమ వేతనాలు, పారితోషకాలను 30 శాతం మేర పెంచాలంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇటీవల మెరుపు సమ్మెకు దిగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెతో హఠాత్తుగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఇండస్ట్రీ అంతా స్తంభించిపోయింది. ఇప్పటికే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో సినీ కార్మికుల వేతనాలు ఎక్కువ అంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడారు. అదే సమయంలో మూడేళ్లుగా వేతనాల్లో పెంపు లేని నేపథ్యంలో కార్మికుల డిమాండ్ న్యాయమైందే అన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ ఒకేసారి 30 శాతం పెంపు అంటే కష్టం అనే వాదనా వినిపించింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులతో చర్చలు జరిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు.. ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. జీతాలు పెంచడానికి సరే అన్నారు కానీ.. కార్మికులు కోరుకున్నట్లు కాదు. విడతల వారీగా వేతనాలు పెంచేలా ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను సీనియర్ నిర్మాత దామోదర ప్రసాద్ మీడియా ద్వారా వెల్లడించారు.
రోజుకు రూ.2 వేలు సంపాదిస్తున్న సినీ కార్మికుడికి ఈ ఏడాది 15 శాతం పెంచడానికి చాంబర్ అంగీకరించింది. వచ్చే ఏడాది 5 శాతం, ఆ తర్వాతి ఏడాది మరో 5శాతం వేతనం పెరుగుతుంది. కార్మికులు ఎక్కువ అడిగారు కానీ.. తాము ఈ మేరకు పెంచేందుకు ఒప్పుకున్నామని దామోదర ప్రసాద్ తెలిపారు. రోజూ వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న కార్మికుడికి ఇప్పుడు 20 శాతం పెంచేలా ప్రతిపాదించారు. రెండో ఏడాది పెంపు ఉండదు. మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది.
చిన్న సినిమాలకు పని చేస్తున్న కార్మికులకు మాత్రం అవే వేతనాలు కొనసాగనున్నాయి. లో బడ్జెట్లో తీసే సినిమాల మీద భారం పడకుండా వాటికి పని చేసే కార్మికులకు మాత్రం అవే జీతాలు కొనసాగించాలని నిర్ణయించారు. తాము ఈ మేరకు ప్రతిపాదించామని.. వీటికి కార్మికులు సరే అంటే ఆ మేరకు వేతనాలు అమల్లోకి వస్తాయని దామోదర ప్రసాద్ తెలిపారు. మరి అంతిమంగా ఇరు వర్గాలు ఏం నిర్ణయిస్తాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates