విడుదలకు ఆరు రోజుల ముందే కూలి మేనియా మొదలైపోయింది. ఓవర్సీస్ లో ఇప్పటికే 3 మిలియన్లు రాబట్టేసిన రజనీకాంత్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచననాలు నమోదు చేస్తాడో ఊహించుకోవడం కష్టం. కేవలం కేరళ బుకింగ్స్ ఓపెన్ చేస్తే నిమిషాల వ్యవధిలో గంటకు 40 వేలకు పైగా టికెట్లు అమ్మేస్తూ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఉదయం 6 గంటల నుంచి షోలు ప్రారంభించబోతున్నారు. టికెట్ రేట్ల పెంపు కోసం ఎదురు చూస్తున్న ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఆ ఉత్తర్వులు రాగానే ఆదివారం లేదా సోమవారం నుంచి టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టబోతున్నారు.
ఇదంతా కేవలం రజనీకాంత్ క్రెడిట్ అని చెప్పలేం. ఆయనతో సమానంగా లోకేష్ కనగరాజ్ బ్రాండ్ చాలా శక్తివంతంగా పని చేస్తోంది. అందులోనూ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర పాత్రలు, పూజా హెగ్డే డాన్స్ చేసిన మౌనిక మౌనిక పాట అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి. ట్రైలర్ మీద మిశ్రమ స్పందన వచ్చినా అదేమీ నెగటివ్ కాకపోవడం అతి పెద్ద సానుకూలాంశం. రజిని స్టార్ పవర్ కు ఇన్నేసి ఆకర్షణలు తోడవ్వడంతో ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో ఆల్ టైం రికార్డులకు రంగం సిద్ధమయ్యింది. ప్రత్యేక షోల కోసం నిర్మాతలు స్టాలిన్ ప్రభుత్వానికి విన్నపం పెట్టుకున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరయ్యే కొద్దీ కూలి ప్రమోషన్ల వేగం పెంచుతోంది. అమెజాన్ డెలివరీ బాక్సుల మీద స్టిక్కర్లు వేయించింది. వివిధ నగరాల్లోని మెట్రో ట్రైన్ల మీద యాడ్స్ వేయించి జనం దృష్టిలో పడుతోంది. అవుట్ డోర్ పబ్లిసిటీ భీభత్సంగా చేస్తున్నారు. ఏ విషయంలోనూ రాజీ లేకుండా ఆగస్ట్ 14 దాకా ఇవి కొనసాగించబోతున్నారు. వార్ 2 దేశవ్యాప్తంగా అధిక శాతం ప్రీమియం థియేటర్లు, ఐమాక్స్ స్క్రీన్లు బ్లాక్ చేసినప్పటికీ కూలి ఇంత దూకుడు చూపించడం విశేషం. ఫస్ట్ డే గ్రాస్ వంద నుంచి నూటా యాభై కోట్లకు పైగానే ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates