పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న తర్వాతి చిత్రం.. రాజా సాబ్. ఈ మూవీ విడుదల తేదీ విషయంలో కొంత కాలంగా తర్జన భర్జనలు నడుస్తున్నాయి. ‘రాజా సాబ్’ టీజర్ లాంచ్ అయినపుడు డిసెంబరు 5న విడుదల అన్నారు. కానీ ఈ మధ్య సంక్రాంతి రిలీజ్ అంటూ కొత్త ప్రచారం మొదలైంది. ఐతే ఈ రెండు డేట్లనూ తాము పరిశీలిస్తున్నామని.. సినిమాకు ఏది మంచిదో దాన్ని ఖరారు చేస్తామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘రాజా సాబ్’ గురించి మరి కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
‘రాజా సాబ్’ సీక్వెల్ కూడా ఉంటుందని ఆయన వెల్లడించడం విశేషం. ఐతే ఇది ‘రాజా సాబ్’ కథకు కొనసాగింపుగా ఉండదంటూ ఆయన ట్విస్ట్ ఇచ్చారు. రాజాసాబ్ వరల్డ్‌ను కొనసాగిస్తూ కొత్త కథతో ఇంకో సినిమా తీస్తామని ఆయన చెప్పారు. ఐతే అందులో కూడా ప్రభాస్ నటిస్తాడా.. ఇంకో హీరోతో చేస్తారా అన్నది విశ్వప్రసాద్ వెల్లడించలేదు. ఇక ‘రాజాసాబ్’ షూటింగ్ అప్‌డేట్ ఇస్తూ.. కొంచెం ప్యాచ్ వర్క్, పాటలు మినహా సినిమా పూర్తయిందని ఆయన తెలిపారు. అక్టోబరు చివరికల్లా సినిమా రెడీ అయిపోతుందని విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి సినిమా రఫ్ కట్ నాలుగున్నర గంటలు ఉందని.. ఏ పెద్ద సినిమా అయినా ఇదే స్థాయిలో ఉంటుందని.. దీన్ని మూడు గంటలకు అటు ఇటు నిడివికి తగ్గించాల్సి ఉందని.. ఫైనల్ రన్ టైం ఎంత అన్నది దర్శకుడి చేతుల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఇక తమ బేనర్ నుంచి రానున్న మరో ప్రెస్టీజియస్ మూవీ ‘మిరాయ్’ని దసరా కానుకగా సెప్టెంబరు 27న రిలీజ్ చేద్దామని చూశామని.. కానీ ఓజీ, అఖండ-2 ఆ డేట్‌కు షెడ్యూల్ అయి ఉండడంతో సెప్టెంబరు 5నే తమ చిత్రాన్ని తీసుకొస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates