ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కానున్న వార్ 2 ప్రమోషన్లకు సంబంధించి యష్ రాజ్ ఫిలిమ్స్ దూకుడు చూపించడం లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ బుకింగ్స్ దేవర స్థాయిలో వేగంగా లేకపోవడానికి ఇదే కారణంగా పేర్కొంటున్నారు. హృతిక్ రోషన్ పలు ఈవెంట్లలో కనిపిస్తూ కబుర్లు పంచుకుంటున్నాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ దర్శనం ఇంకా జరగకపోవడం అభిమానుల అసహనాన్ని పెంచుతోంది. రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందు హడావిడి చేయడం కన్నా ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ కి కనీసం పది రోజుల ముందస్తు ప్లానింగ్ అవసరమన్న వాళ్ళ అభిప్రాయాన్ని కొట్టి పారేయలేం
ఇప్పటిదాకా బయటికొచ్చింది ఒక పాటే. అది కూడా హృతిక్ రోషన్ – కియారా అద్వానీల అయాన్ జవాన్ సాంగ్. తాజాగా దాని మేకింగ్ వీడియోని బయటికి వదిలారు. కానీ అసలు తారక్ కి జోడి ఉందో లేదో కూడా బయటికి చెప్పకపోవడం ఆశ్చర్యమే. ఇద్దరు హీరోల డాన్స్ తాలూకు వీడియో ప్రోమో చిన్నది కట్ చేయించారు కానీ, అది కూడా రేపు గ్లిమ్ప్స్ రూపంలో రిలీజ్ కానుంది. ఫుల్ వీడియో కాదు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ పెంపు కోసం ప్రయత్నాలు చేస్తున్న వార్ 2 పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాల్సిన టైం అయితే వచ్చింది. సోమవారం నుంచి ఈ పనులు చూస్తానని చెప్పిన డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ వైపు ఎలాంటి మూమెంట్ లేదు.
ఒకవేళ పోటీలో కూలీ లేకపోయి ఉంటే ఇంతగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఒకవైపు రజనీకాంత్ మాస్ బుకింగ్స్ తో దూసుకుపోవడంతో ఓపెనింగ్స్ విషయంలో దెబ్బ పడుతుందేమోననే టెన్షన్ తారక్ ఫ్యాన్స్ లో రావడం సహజం. ఎందుకంటే సౌత్ ఇండియా బిజినెస్ లో అధిక శాతం జూనియర్ ఎన్టీఆర్ పేరు మీదే నడుస్తోంది. ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజీ, అందులో ఇంటర్వ్యూ మాస్ ని చేరుకోవు. అవుట్ డోర్ లో కనిపించాలి. సోషల్ మీడియా, టీవీని వాడుకోవాలి. మరీ ముఖ్యంగా ఈవెంట్లు చేయాలి. మరి వార్ 2 త్వరగా మేలుకుని ఫ్యాన్స్ ని శాంతించే ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates