యూట్యూబ్ అనేది ఒక మహా సముద్రం. అక్కడ ఐడెంటిటీ లేకుండా ఏం మాట్లాడినా.. ఏం చూపించినా చెల్లిపోతుంది అనుకుంటారు జనాలు. యూట్యూబ్ ఛానెల్ పెట్టేసి సంచలనం రేపేలా థంబ్ నైల్స్ పెట్టి ఇష్టానుసారం వార్తలు ప్రెజెంట్ చేసి వ్యూస్ రాబడుతుంటారు. ఇలాంటి వాళ్లను సెలబ్రెటీలు చాలా వరకు లైట్ తీసుకుంటుంటారు.
యూట్యూబ్ ఛానెల్‌లలో వచ్చే ప్రతి వార్త మీదా స్పందించాలంటే కష్టమని ఊరుకుంటూ ఉంటారు. కానీ వీటి ద్వారా జరిగే డ్యామేజ్ తక్కువేమీ కాదు. సెన్సిటివ్ ఇష్యూస్‌లోకి తమను లాగి పేరు చెడగొడుతుంటే సెలబ్రెటీలు ఊరికే ఉండలేరు. తాజాగా అక్షయ్ కుమార్ ఇలాంటి ఇష్యూ మీదే తీవ్రంగా స్పందించాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన వ్యవహారంలోకి తన పేరును లాగి ఇష్టానుసారం ఆరోపణలు చేసిన సిద్దిఖి అనే యూట్యూబర్ మీద ఏకంగా రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు.
సుశాంత్ మరణానంతరం సంచలన కథనాలతో ఈ యూట్యూబర్ భారీగా సబ్స్క్రైబర్లను పెంచుకున్నాడు. కొన్ని నెలల్లో అతడి సబ్స్క్రైబర్ల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఈ ఛానెల్లో కథనాలతో సిద్దిఖి లక్షల్లో ఆదాయం కూడా సంపాదించాడు. తన ఛానెల్లో సిద్ధిఖి.. సుశాంత్ మరణంతో అక్షయ్‌కు సంబంధం ఉందని ఆరోపించాడు.
సుశాంత్ హీరోగా ఎదిగిపోవడం, ‘ఎం.ఎస్.ధోని’ లాంటి పెద్ద చిత్రాలను దక్కించుకోవడం అక్షయ్‌కు నచ్చలేదని, అలాగే సుశాంత్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేలను కలవడం నచ్చలేదని పేర్కొన్నాడు. అలాగే సుశాంత్ మృతికి సంబంధించిన కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తిని బయటపడేసి, తనకు పౌరసత్వం ఉన్న కెనడాకు అక్షయ్ పంపించాడని ఆరోపించాడు. ఇలా రకరకాల ఆరోపణలతో తన పేరును చెడగొట్టే ప్రయత్నం చేసిన సిద్దిఖి విషయంలో అక్షయ్ తీవ్రంగా స్పందించాడు. ఇంకెవరూ ఆధారాల్లేకుండా ఇలా ఆరోపణలు, వ్యాఖ్యలు చేయొద్దన్న సంకేతం ఇవ్వడానికో ఏమో ఏకంగా రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్దిఖి మీద కేసులు పెట్టి అతణ్ని అరెస్టు చేయడం గమనార్హం.