రజినీకి ఇది తగునా?

రజినీకాంత్ తమిళంలోనే కాదు.. తెలుగులోనూ సూపర్ స్టారే. దశాబ్దాలుగా ఆయన సినిమాలు తెలుగులో గొప్ప ఆదరణ పొందుతున్నాయి. రజినీ సినిమా వస్తుంటే.. పోటీగా ఇక్కడి చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకప్పుడు. ఆయన చిత్రాలకు తెలుగులో వచ్చే మిడ్ రేంజ్ మూవీస్‌కు దీటుగా ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో, కబాలి, 2.0, జైలర్ లాంటి చిత్రాలకు వచ్చిన వసూళ్లు చూసి ఇక్కడి వాళ్లు విస్తుబోయారు. ఐతే తన చిత్రాలకు ఇంత ఆదరణ దక్కుతున్నా.. రజినీ ఇక్కడికి వచ్చి ప్రమోషన్లలో పాల్గొనడం అరుదు.

ఒకప్పుడైనా వచ్చి ప్రెస్ మీట్లలో పాల్గొనడం లాంటివి చేసేవారు. కానీ చాలా ఏళ్లుగా ఇటు రావడమే మానేశారు. మధ్యలో రజినీ మార్కెట్ దెబ్బ తిని కొన్ని సినిమాలకు బజ్ క్రియేట్ కాలేదు. అప్పుడు కూడా రజినీ లైట్ తీసుకున్నారు. ‘జైలర్’ తర్వాత మళ్లీ ఆయన మార్కెట్ పైకి లేచింది. ఇక ఆయన కొత్త చిత్రం ‘కూలీ’కి తెలుగులో మామూలు హైప్ లేదు. ఏకంగా 50 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిందీ చిత్రం ఇక్కడ. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వంద కోట్ల వసూళ్లు దాటడం గ్యారెంటీ. మరి తన మీద, తన సినిమా మీద తెలుగు ప్రేక్షకులు ఇంత ప్రేమ చూపిస్తుంటే.. ఇక్కడికి వచ్చిన ఒక ప్రెస్ మీట్లో రజినీ పాల్గొంటే బాగుంటుంది కదా? కానీ రజినీ ఆ పని చేయలేదు.

సోమవారం హైదరాబాద్‌లో ‘కూలీ’కి సంబంధించి ఒక పెద్ద ప్రెస్ మీట్ ఒకటి ప్లాన్ చేశారు. దీనికి అక్కినేని నాగార్జున, లోకేష్ కనకరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రజినీ కూడా పాల్గొంటారని ముందు వార్తలు వచ్చాయి. కానీ చివరికి చూస్తే ఆయన రాలేదు. ఒక వీడియో బైట్‌తో సరిపెట్టారు. రజినీకి వయసు మీద పడడం, గతంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం వాస్తవం. కానీ ఈ మధ్య ఉత్సాహంగానే ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. చెన్నైలో నిర్వహించిన భారీ ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. అలాంటపుడు ఒకసారి హైదరాబాద్‌కు వచ్చి తన సినిమా ప్రెస్ మీట్లో పాల్గొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.