హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి కాంతార 3 ఉంటుందని చెప్పడం, అందులో ఇంకో స్టార్ హీరోకి ప్రాధాన్యం ఉంటుందని లీకైపోవడంతో ఒక్కసారిగా ఈ కాంబో గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పార్ట్ త్రీలో జూనియర్ ఎన్టీఆర్ చేయడం ఖాయమని గాసిప్స్ తిరగడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అయోమయానికి గురయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి అలాంటిదేమి లేదు. తారక్, రిషబ్ మధ్య ఘాడమైన స్నేహం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి కలిసి చేసే ప్రతిపాదనలో ఇద్దరు లేరని బెంగళూరు టాక్. భవిష్యత్తులో ఉండొచ్చేమో కానీ ఇప్పటికైతే కాదని అంటున్నారు.
దీన్ని సమర్ధించేందుకు కారణాలు లేకపోలేదు. ‘వార్ 2’ రిలీజయ్యాక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ వచ్చే ఏడాది జూలై లో విడుదలైపోతుంది. ఆ తర్వాత ‘దేవర 2’ కోసం కొరటాల శివ తన హీరోని సెట్స్ మీదకు తీసుకెళ్లడం దాదాపు ఖాయమంటున్నారు. షూటింగ్ వేగంగా చేసేలా ప్లానింగ్ జరిగిందట. అదే నిజమైన పక్షంలో 2026 గడిచిపోతుంది. నెక్స్ట్ లిస్ట్ లో ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ ఉన్నారు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ అందులోనూ శక్తివంతమైన డివోషనల్ ఎలిమెంట్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీ. ఎంత లేదన్నా దానికో ఏడాదికి పైగానే కేటాయించాల్సి ఉంటుంది.
వీటితో పాటు జైలర్ ఫేమ్ ‘నెల్సన్ దిలీప్ కుమార్’ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఉంది. పైన చెప్పినవన్నీ పూర్తయ్యాక లేదా వాటిలో ఏదైనా ఒకటి ఆలస్యమయ్యే పక్షంలో ఈ కలయికకు శ్రీకారం చుట్టేస్తారు. ఇప్పటిదాకా చెప్పుకున్న లిస్టులో మొత్తం అయిదు సినిమాలు మూడేళ్ళకు సరిపడా ఉన్నాయి. అలాంటప్పుడు ఒకవేళ రిషబ్ శెట్టి కాంతార 3 ప్లాన్ చేసుకున్నా అందులో చేసేంత టైం జూనియర్ దగ్గర లేదు. ఏదైనా అతిథి పాత్ర అయితే తప్ప. ఇవి చాలదన్నట్టు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తారక్ చేస్తాడనే ప్రచారం ఆ మధ్య జరిగింది. చూడాలి ఈ లైనప్ లో ఇంకేమేం మార్పులు చోటు చేసుకోబోతున్నాయో.
Gulte Telugu Telugu Political and Movie News Updates