నరసింహ ఉగ్రావతారం శాంతించేలా లేదు  

యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతోంది. హరిహర వీరమల్లుకు పోటీగా ఒక రోజు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా మీద ముందు పెద్దగా అంచనాలు లేవు. రిలీజ్ రోజు అన్ని కేంద్రాల్లో షోలు కూడా చాలా తక్కువగా పడ్డాయి. అయితే మౌత్ టాక్ బాగుంటే ఎలాంటి ప్రమోషన్లు చేయకపోయినా జనాలు థియేటర్లకు కదిలి వస్తారని ఈ సినిమా ఋజువు చేస్తోంది. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ లో పదో రోజులో ఉన్న మహావతార్ 1 కోటి 40 లక్షలకు పైచిలుకు వసూలు చేయగా ఇంకా నాలుగో రోజులోనే ఉన్న కింగ్డమ్ 98 లక్షల దగ్గరే ఉండటం ట్రెండ్ ఎటు ఉందో సూచిస్తోంది.

బుక్ మై షోలో సండే ప్రతి గంటకు సగటున 11 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్న చిత్రం మహావతార్ నరసింహ ఒక్కటే. దీని ఓవర్ ఫ్లోస్ ఇతర సినిమాల కలెక్షన్లకు ఉపయోగపడుతున్నాయనే కామెంట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డెబ్భై కోట్ల గ్రాస్ దాటేసిన ఈ డివోషనల్ డ్రామా ఇంకో వారంలో వంద కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయం. ఇప్పటిదాకా ఏ భాషలోనూ ఒక యానిమేషన్ మూవీ ఇంత వసూలు చేయడం ఎప్పుడూ జరగలేదు. ఇరవై సంవత్సరాల క్రితం హనుమాన్ మంచి విజయం సాధించింది కానీ కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు చేయలేదు.

మహావతార్ నరసింహ ఇప్పట్లో శాంతించేలా లేదని ఇండస్ట్రీ టాక్. ఆగస్ట్ 14 కూలి, వార్ 2 వచ్చేదాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని అంటున్నారు. సహనిర్మాతగా ఉన్న హోంబాలే ఫిలింస్ సైతం ఇంత పెద్ద రెస్పాన్స్ ఊహించలేదేమో. బిజినెస్ లో ఇన్వాల్ అయిన బయ్యర్లలందరూ మంచి లాభాలు కళ్లజూస్తున్నారు. మొదట్లో ప్రమోషన్ ని లైట్ తీసుకున్న ప్రొడక్షన్ టీమ్ దర్శకుడు అశ్విన్ కుమార్ ని రంగంలోకి దించింది. ఆయన ఇస్తున్న ఇంటర్వ్యూలు పబ్లిక్ లోకి వెళ్తున్నాయి. కంటెంట్ ఉంటే అసలు స్టార్లు లేకపోయినా, కేవలం విజువల్ ఎఫెక్ట్స్ తో బొమ్మ నడిపించినా బ్లాక్ బస్టర్ దక్కుతుందని మహావతార్ నిరూపించింది.