కింగ్డ‌మ్ విల‌న్.. చెప్పి మ‌రీ కొట్టాడు

ఒక కొత్త న‌టుడి న‌ట‌నకు ఇంప్రెస్ అయితే అత‌డికి అభిమానులు ఏర్ప‌డ‌తారు. కానీ తెలుగులో త‌న తొలి సినిమా విడుద‌ల కావ‌డానికి ముందే కేవ‌లం ఒక స్పీచ్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించేశాడు మ‌ల‌యాళ న‌టుడు వెంకిటేష్ వీపీ. అత‌ను మ‌ల‌యాళంలో కూడా అంత పాపుల‌ర్ న‌టుడేమీ కాదు. ఇప్ప‌టిదాకా నాలుగైదు సినిమాలే న‌టించాడు. అక్క‌డ న‌టుడిగా చిన్న చిన్న అడుగులు వేస్తుండ‌గానే.. తెలుగులో కింగ్డ‌మ్ లాంటి క్రేజీ మూవీలో మెయిన్ విల‌న్ పాత్ర చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఈ అవ‌కాశాన్ని గొప్ప‌గా ఉప‌యోగించుకుని టీంను ఇంప్రెస్ చేశాడు. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ విడుద‌ల‌కు ముందే త‌న గురించి ఒక పోస్ట్ పెట్టి త‌న న‌ట‌న‌ను కొనియాడాడు.

ఇక కింగ్డ‌మ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెంకిటేష్ ప‌ది నిమిషాల పాటు చాలా ఉత్సాహంగా ఇచ్చిన స్పీచ్‌తో ఉర్రూత‌లూగించి ఆ ప్ర‌సంగంతోనే అభిమానులను సంపాదంచుకున్నాడు. ఆ ఈవెంట్లో మాట్లాడుతూ.. సినిమాలో త‌న ఎంట్రీకి క్లాప్స్ కొట్టాల‌ని, త‌న‌ను ఎంక‌రేజ్ చేయాల‌ని కోరాడు వెంకిటేష్‌. ఇక గురువారం కింగ్డ‌మ్ థియేట‌ర్ల‌లో సినిమా చూసిన వాళ్లందరికీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎంట్రీకి ఎలాంటి స్పంద‌న క‌నిపించిందో.. వెంకిటేష్ పాత్ర ప్ర‌వేశించినపుడు కూడా అలాంటి రెస్పాన్సే ద‌ర్శ‌న‌మిచ్చింది. వెంకిటేష్ క‌నిపించగానే థియేటర్లు హోరెత్తాయి. కొన్ని కీల‌క స‌న్నివేశాల్లో త‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.

ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఊచ‌కోత సీన్‌లో అత‌ను మామూలుగా పెర్ఫామ్ చేయ‌లేదు. క‌ళ్ల‌తో వెంకిటేష్ హావ‌భావాలు ప‌లికించిన తీరుకు ఆడియ‌న్స్ అబ్బుర‌ప‌డ్డారు. ఇత‌ను మామూలు న‌టుడు కాద‌నే ఫీలింగ్ క‌లిగింది. ఐతే ఈ పాత్రకు ఇంకా ప్రాధాన్యం ఉండాల్సింద‌ని.. పార్ట్-2లో కూడా కొన‌సాగించాల్సింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో కానీ.. పార్ట్-1లో మాత్రం హీరో విజ‌య్‌తో స‌మానంగా పేరు సంపాదించాడు వెంకిటేష్‌. ప్రి రిలీజ్ ఈవెంట్ ప్ర‌సంగంలో వెంకిటేష్ ఎందుకంత ఎగ్జైట్ అయ్యాడ‌న్న‌ది సినిమా చూసినపుడు అంద‌రికీ అర్థ‌మైంది. వెంకిటేష్ చెప్పి మ‌రీ కొట్టాడంటూ అత‌ణ్ని ఇప్పుడు అంద‌రూ కొనియాడుతున్నారు. ఈ పెర్ఫామెన్స్‌తో తెలుగులో ఈ యువ న‌టుడికి బాగానే అవ‌కాశాలు వ‌స్తాయ‌న‌డంలో సందేహం లేదు.