ఊర్వశి రౌటెలా.. అటు బాలీవుడ్లో, ఇటు టాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన నటి. తెలుగులో ఆమె వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ లాంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఊర్వశి.. ఇటీవల రూ.70 లక్షల బ్యాగ్‌ను పోగొట్టుకుందట. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో తన బ్యాగు చోరీకి గురైనట్లు ఆమె వెల్లడించింది. గత నెలలో ఊర్వశి ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ‘వింబుల్డన్’కు హాజరైంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో తన బ్యాగ్ పోగొట్టుకున్నట్లు ఆమె తెలిపింది.
తన లగ్జరీ జ్యువెలరీ ఉన్న బ్యాగ్ అది అని.. దాని విలువ రూ.70 లక్షలని ఊర్వశి సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది.
వింబుల్డన్ మహిళల ఫైనల్‌కు సెలబ్రెటీ గెస్ట్‌గా హాజరై అనంతరం గాట్విక్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడే తన బ్యాగ్ పోయిందని ఊర్వశి తెలిపింది. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. విమానాశ్రయ సిబ్బంది నుంచి తగిన సహకారం అందలేదని ఊర్వశి వాపోయింది.
గాట్విక్ ఎయిర్‌పోర్ట్ వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని ఆమె చెప్పింది. ఊర్వశి ఇలా విలువైన వస్తువులు పోగొట్టుకోవడం ఇది తొలిసారి కాదు. 2023లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో ఆమె బ్యాగ్ సహా రూ. 45 లక్షల విలువైన వస్తువులు పోగొట్టుకుంది. మరో సందర్భంలో తన కస్టమైజ్డ్ లగ్జరీ ఐఫోన్ చోరీకి గురైనట్లు ఆమె వెల్లడించారు. తాజా ఉదంతం నేపథ్యంలో ఊర్వశికి ఎప్పుడూ ఏదో ఒక వస్తువు పోగొట్టుకోవడం అలవాటా అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates