మయసభ సిరీస్ వివాదాలు రేపుతుందా

మాములుగా సినిమాలకొచ్చే వివాదాలను సెన్సార్ బోర్డు చూసుకుంటుంది. సర్టిఫికెట్ ఇచ్చే ముందే కాంట్రావర్సిలు వచ్చే అవకాశాలను కాచి వడబోస్తుంది. కానీ వెబ్ సిరీస్ లకు ఆ ఛాన్స్ లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటెంట్లను చూపించొచ్చు. ప్రస్థానం, ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్ లాంటి సోషల్ ఇష్యూస్ ముడిపడిన మూవీస్ ఇచ్చిన దర్శకుడు దేవా కట్ట డైరెక్ట్ చేసిన మయసభ ఆగస్ట్ 8 స్ట్రీమింగ్ కానుంది. సోని లివ్ వేదికగా విడుదల చేయబోతున్నారు. ఇవాళ సాయి ధరమ్ తేజ్ గెస్టుగా ట్రైలర్ లాంచ్ చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియో చూశాక చాలా మందికి చాలా సందేహాలు కలుగుతున్నాయి.

ఇది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ సిఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిల స్నేహం, రాజకీయ ప్రయాణం మీద తీసిందనేది చిన్న పిల్లాడు చూసినా చెబుతాడు. కానీ మేకర్స్ తెలివిగా పేర్లు మార్చేశారు. వివాదాలకు చోటివ్వకుండా ఇది కల్పిత కథని ప్రొజెక్టు చేస్తున్నారు. అయితే పొలిటికల్ గా బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండుల మధ్య యువకులుగా ఉన్నప్పటి నుంచే అంత ఫ్రెండ్ షిప్ ఉందా అనేది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. పలు సందర్భాల్లో తమ స్నేహం గురించి ఇద్దరు వేర్వేరు ఇంటర్వ్యూలలో చెప్పడం గతంలో జరిగింది. కానీ ఎప్పుడూ వినని, చదవని, చూడని సంఘటనలు దేవ కట్టా చాలా పొందుపరిచినట్టు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.

రిలీజయ్యాక పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఉప్పు నిప్పులా ఉన్న రెండు పార్టీల అధినాయకులు ఒకప్పుడు గొప్ప స్నేహంతో ఉన్నారనేది ఇప్పటి జనరేషన్ కు అంతగా తెలియని వాస్తవం. మరి దేవ కట్టా దాన్ని సినిమాటిక్ గా ఎలా చూపిస్తారనేది ఇంకో వారం రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. ఆది పినిశెట్టి నాయుడుగా, చైతన్యరావు రెడ్డిగా నటించిన మయసభలో స్వర్గీయ ఎన్టీఆర్ ని పోలిన పాత్రను సాయికుమార్ పోషించారు. ఒకరకంగా చెప్పాలంటే కొంత కాలంగా తెలుగులో చెప్పుకోదగ్గ వెబ్ సిరీస్ రాని లోటుని ఇదేమైనా తీరుస్తుందేమో.