ఆదిత్య 999… అంచనాలకు అందని ట్విస్టులు

నందమూరి బాలకృష్ణ కెరీర్ ల్యాండ్ మార్క్ సినిమాల్లో ఆదిత్య 369ది ప్రత్యేక స్థానం. ఎప్పుడో ముప్పై నాలుగేళ్ల క్రితం టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని టైంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన ఈ మాయాజాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కమర్షియల్ గా రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ ఆబాలగోపాలన్ని అలరించిన మూవీగా కలకాలం నిలిచిపోయింది. ఇటీవలే సరికొత్త 4కె ప్రింట్ తో రీ రిలీజ్ చేస్తే వసూళ్లు పెద్దగా రాలేదు కానీ చూసిన ఆడియన్స్ మాత్రం సరికొత్త అనుభూతిని పొందారు. ఇదంతా పక్కన పెడితే ఎప్పటి నుంచో ఆదిత్య 369 సీక్వెల్ తీయాలనేది బాలకృష్ణ లక్ష్యం.

ఇప్పుడు దాన్ని తీర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయని ఫిలిం నగర్ టాక్. దీని బాధ్యతలు దర్శకుడు క్రిష్ కు అప్పజెప్పారనేది కొన్ని వారాల క్రితమే వచ్చిన లీక్. ఆదిత్య 999 మ్యాక్స్ టైటిల్ తో బాలకృష్ణ స్వయంగా ఒక కథను సిద్ధం చేసుకున్నారు. అందులో మోక్షజ్ఞ కూడా ఉన్నాడు. సోలో హీరోగా డెబ్యూ చేయించడం కంటే తన సినిమాలో భాగం చేసి ఆ తర్వాత ఒంటరిగా సినిమాలు చేయించడానికి బాలయ్య ఫిక్స్ అయ్యారట. తండ్రి ఎన్టీఆర్ తన విషయంలో పాటించిన పద్ధతినే ఇప్పుడు బాలకృష్ణ మోక్షజ్ఞను అనుసరించబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ కాబట్టి పాత్ర, పెర్ఫార్మన్స్ పరంగా బోలెడు స్కోప్ దక్కుతుంది.

ఇంకో విశేషం ఏంటంటే ఆదిత్య 999లో బాలయ్య మూడు పాత్రలు చేయనున్నట్టు సమాచారం. గతంలో అధినాయకుడు వచ్చింది కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు. అది రెగ్యులర్ మాస్ మూవీ కనక జనాలకు చేరలేదు. కానీ ఆదిత్య 999 అలా కాదట. మరోసారి శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ మెరవొచ్చని అంటున్నారు. ఇంకో రెండు క్యారెక్టర్లు ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈసారి టైం మెషీన్ లో ఏకంగా ద్వాపర, తేత్రా యుగాలకు తీసుకెళ్లి ఊహకందని ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని ఇన్ సైడ్ టాక్. ఘాటీ రిలీజయ్యాక క్రిష్ ఈ పనులు మొదలుపెట్టబోతున్నాడు. ప్రారంభం కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది.