అఖండ‌-2 Vs ఓజీ: వెనక్కి తగ్గేది ఎవరు?

ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో భారీ చిత్రాలు ఆశించిన స్థాయిలో లేక ఒకింత అసంతృప్తికి గుర‌య్యారు ప్రేక్ష‌కులు. కానీ సెకండాఫ్‌లో పెద్ద సినిమాలు, క్రేజీ చిత్రాలు చాలానే షెడ్యూల్ అయ్యాయి. ఇటీవ‌లే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజైంది. త‌ర్వాత కింగ్‌డ‌మ్ రాబోతోంది. వ‌చ్చే నెల‌లో కూలీ, వార్-2 లాంటి క్రేజీ మూవీస్ ఒకేరోజు విడుద‌ల కాబోతున్నాయి. ఆ త‌ర్వాతి నెల‌లో మ‌రో మెగా క్లాష్ చూడబోతున్నాం. ద‌స‌రా వీకెండ్లో ఓజీ, అఖండ‌-2 చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ స్థాయి పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ‌వుతాయా.. వీటిలో ఒక‌టి ప‌క్క‌కు త‌ప్పుకుంటుందేమో అన్న చ‌ర్చ జ‌రిగింది ఒక ద‌శ‌లో.

వాటి షూటింగ్ స‌మ‌యానికి పూర్త‌యి, చెప్పిన డేట్‌కు వ‌స్తాయా అనే సందేహాలు కూడా క‌లిగాయి. కానీ ఆ రెండు చిత్రాల మేక‌ర్స్ పోటీకి సై అనే అంటున్నారు. సినిమాను ఆ స‌మ‌యానికి రెడీ చేసే విష‌యంలోనూ ఇబ్బందులేమీ లేన‌ట్లే. ఇప్ప‌టికే ఓజీ షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబ‌రు 25న ఓజీ రిలీజ‌య్యే విష‌యంలో ఎలాంటి సందేహాలూ లేవు. ఇక అఖండ-2 విష‌యానికి వ‌స్తే… తాజాగా భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర్లో ఈ సినిమా టాకీ పార్ట్ చివ‌రి షెడ్యూల్ చేశారు.

అక్క‌డ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న అనంత‌రం భ‌ద్రాచ‌లం రాముల‌వారిని ద‌ర్శించుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.. మీడియాతో కూడా మాట్లాడారు. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ అంతా పూర్త‌యిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. సెప్టెంబ‌రు 25న నంద‌మూరి అభిమానులు అస‌లైన ద‌స‌రా పండుగ చూస్తారంటూ ఆయ‌న ఉత్సాహాన్ని నింపారు. ఆగ‌స్టు స‌గానిక‌ల్లా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా అయిపోతుంద‌ని.. ఆ త‌ర్వాత విడుద‌ల‌కు 40 రోజుల స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, ప్ర‌మోష‌న్ల‌కు ఇబ్బందేమీ ఉండ‌ద‌ని.. పాన్ ఇండియా స్థాయిలో భారీగా సినిమాను రిలీజ్ చేసేలా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది. ద‌స‌రా పండ‌క్కి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేసే స్కోప్ ఉంటుంది కాబ‌ట్టి.. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సంద‌డి మామూలుగా ఉండ‌ద‌న్న‌ట్లే.