కరోనా తర్వాత మొదలైన ఓటీటీ విప్లవంలో ఎక్కువ ప్రయోజనం పొందిన ఇండస్ట్రీ అంటే మాలీవుడ్ అనే చెప్పాలి. ఎప్పట్నుంచో గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నప్పటికీ.. మలయాళం ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది, అక్కడి నటులకు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఫేమ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో కేవలం ఓటీటీల ద్వారా వచ్చిన మలయాళ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు టొవినో థామస్. ఆహా సహా పలు ఓటీటీల ద్వారా అతడి సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. 2018, ఏఆర్ఎం లాంటి సినిమాలకు థియేటర్లలోనూ ఆదరణ దక్కడానికి ఈ ఫాలోయింగే కారణం.
ఇప్పుడు అతను తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టేస్తున్నాడు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో కావడం విశేషం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో టొవినో నటిస్తున్నట్లు ఇంతకుముందే రూమర్లు వచ్చాయి. ఇప్పుడా విషయం అధికారికం అయింది. ఈ విషయాన్ని మరో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
డ్రాగన్ సినిమాలో టొవినోతో పాటు మరో ప్రముఖ మలయాళ నటుడు బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు పృథ్వీరాజ్ వెల్లడించాడు. వీళ్లిద్దరి ప్రతిభకు తగ్గట్లే ప్రశాంత్ అదిరిపోయే రోల్స్ ఇచ్చి ఉంటాడని భావిస్తున్నానని.. వాళ్ల పాత్రలు సినిమాకు అసెట్ అవుతాయని అతనన్నాడు. బిజు మీనన్ ఇప్పటికే తెలుగులో రణం సినిమా చేశాడు. కానీ అప్పటికి అతనంత పాపులర్ కాదు. కానీ ఇప్పుడు గొప్ప నటుడిగా ఎదిగాడు. ఇక టొవినో టాలెంట్ ఎలాంటిదో తెలిసిందే. కాబట్టి వీళ్ల పాత్రలు సినిమాలో హైలైట్ అవుతాయనడంలో సందేహం లేదు.
ఇక పృథ్వీరాజ్.. సలార్-2 సినిమా గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. సలార్ కంటే సలార్-2 చాలా పెద్దగా, ఇంకా బలంగా ఉంటుందని అతను చెప్పాడు. తనకు, ప్రభాస్‌కు మధ్య భారీపోరు ఉంటుందని.. ఆ సినిమాను ఎప్పుడెప్పుడు మొదలుపెడదామా అని ఎదురు చూస్తున్నానని పృథ్వీరాజ్ అన్నాడు. ముందు సలార్‌ను ఒక సినిమాగానే చేయాలనుకున్నారని.. తర్వాత అది రెండు భాగాలైందని.. తనకు ఈ సినిమాలో ఇంత పెద్ద రోల్ ఉన్నా ప్రభాస్ ఓకే చెప్పడం చూసి తాను ఆశ్చర్యపోయానని పథ్వీరాజ్ వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates