ఐరెన్ లెగ్ ముద్ర వేయ‌డంపై శ్రుతి

కెరీర్ ఆరంభంలో రెండు మూడు ఫ్లాపులు ప‌డ్డాయంటే చాలు.. హీరోయిన్ల మీద ఐరెన్ లెగ్ ముద్ర ప‌డిపోవ‌డం మామూలే. కానీ ఆ ట్యాగ్ హీరోల‌కు మాత్రం ఇవ్వ‌రు. హీరోయిన్లే ఈ విష‌యంలో బాధితులుగా ఉంటారు. త‌ర్వాత వాళ్ల‌కు అవ‌కాశాలు రావ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. క‌మ‌ల్ హాస‌న్ త‌న‌యురాలు శ్రుతి హాస‌న్ సైతం కెరీర్ ఆరంభంలో ఇదే ఇబ్బంది ఎదుర్కొంది. కాక‌పోతే ఆమెకు అవ‌కాశాలు మాత్రం ఆగ‌లేదు. అన‌గ‌న‌గా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల‌తో చేదు అనుభ‌వాలు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. శ్రుతికి గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో అవ‌కాశం ద‌క్కింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవస‌రం లేక‌పోయింది.

త‌ర్వాత ఆమెను గోల్డెన్ లెగ్ అని కూడా అన్నారు. ఐతే కెరీర్ ఆరంభంలో త‌న మీద వ‌చ్చిన నెగెటివిటీ గురించి తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో శ్రుతి స్పందించింది. త‌న తొలి రెండు చిత్రాల్లో హీరో ఒక‌రే (సిద్దార్థ్) అయిన‌ప్ప‌టికీ.. ఐరెన్ లెగ్ ముద్ర త‌న‌కు మాత్ర‌మే ఆపాదించార‌ని ఆమె వాపోయింది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ మాత్రం ఇదేమీ ప‌ట్టించుకోకుండా గ‌బ్బ‌ర్ సింగ్‌లో త‌న‌కు అవ‌కాశం ఇచ్చార‌ని ఆ సినిమా పెద్ద హిట్ట‌వ‌డంతో త‌న కెరీర్ మారిపోయింద‌ని శ్రుతి చెప్పింది. త‌న‌కు ఐరెన్ లెగ్ మాత్ర‌మే కాదు… గోల్డెన్ లెగ్ అనే బిరుదు కూడా వ‌ద్ద‌ని.. తాను ఒక మామూలు మ‌నిషిని, న‌టిని అని ఆమె చెప్పింది.

త‌న‌కు సినిమా అంటే ఇష్ట‌మ‌ని.. న‌టిగా ఆద‌ర‌ణ ద‌క్కినందుకు సినిమాకు, ప్రేక్ష‌కుల‌కు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని ఆమె చెప్పింది. ఇక కెరీర్లో త‌న మరో ఫ్లాప్ మూవీ 3 గురించి ఆమె మాట్లాడుతూ.. ఆ రోజుల్లో ఓటీటీ, పాన్ ఇండియా సినిమా అనేవి ఉంటే.. ఆ సినిమా ఎక్క‌డికో వెళ్లేద‌ని.. కొల‌వ‌రి పాట‌లాగే పెద్ద హిట్ట‌య్యేద‌ని శ్రుతి చెప్పింది. ఇప్పుడు 3 సినిమా రిలీజైనా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యేద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డింది. త‌న కొత్త చిత్రం కూలీలో ప్రీతి అనే పాత్ర చేశాన‌ని.. ఇనిమేల్ అనే మ్యూజిక్ వీడియో చేసిన‌పుడే త‌న‌కు లోకేష్ క‌న‌క‌రాజ్ క‌థ చెప్పి, ఈ పాత్ర తాను చేస్తున్న‌ట్లు ఫిక్స్ చేశాడ‌ని.. ఇందులో తాను స‌త్య‌రాజ్ కూతురి పాత్ర‌లో నటించాన‌ని.. త‌న కెరీర్లో అది స్పెష‌ల్ రోల్ అని శ్రుతి చెప్పింది.