ఎదురు చూసి చూసి అలిసిపోయేలా చేసిన విశ్వంభర ఎట్టకేలకు చివరి మజిలీకొచ్చింది. అనిల్ రావిపూడి మెగా 157 మొదలుపెట్టాక చిరంజీవి ధ్యాస శ్వాస దాని మీదే ఉండిపోయాయి. చకచకా మూడు షెడ్యూల్స్ పూర్తి చేయడం చూసి ఇతర నిర్మాతలు సైతం షాక్ తిన్నారు. ఒక స్పెషల్ సాంగ్, చిన్న ప్యాచ్ వర్క్ తప్ప మొత్తం ఎప్పుడో ఫినిష్ అయిన విశ్వంభర మాత్రం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. విఎఫెక్స్ ప్రధాన కారణం అయినప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం పలు సందర్భాల్లో తమ అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు వాళ్ళ ఎదురు చూపులు ఫలించే రోజు వచ్చేసింది.
ప్రస్తుతం చిరంజీవి, మౌని రాయ్ ల మీద గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో పాట షూట్ చేస్తున్నారు. దాని తాలూకు ఒక ప్రీ లుక్ దర్శకుడు వశిష్ఠ పంచుకున్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు రిలీజ్ డేట్ ఎప్పుడనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. చూస్తేనేమో ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా చాలా ప్యాన్ ఇండియా సినిమాలు కర్చీఫ్ లు వేసుకుని ఉన్నాయి. విశ్వంభర మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేస్తోంది కానీ మ్యాటర్ ఎంతకీ తేల్చడం లేదు. ఇప్పటికైతే అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని టీజర్ కొచ్చిన నెగటివిటీ మొత్తం ట్రైలర్ తో పోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. హరిహర వీరమల్లు మీద వచ్చిన కంప్లయింట్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ దే మొదటి స్థానం. నిర్మాత ఏఎం రత్నం బెస్ట్ వర్క్ చేయించాం అని చెప్పుకున్నప్పటికీ ఆ క్వాలిటీ తెరమీద పూర్తి స్థాయిలో కనిపించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశ్వంభర బృందం ఒకటికి పదిసార్లు ఫైనల్ కాపీని చెక్ చేసుకోవడం అవసరం. లేదంటే నెగటివిటి, ట్రోలింగ్స్ ఖాయం. త్రిష హీరోయిన్ గా నటించిన విశ్వంభరకు కీరవాణి సంగీతం సమకూర్చగా ఇప్పుడు తీస్తున్న పాటకు భీమ్స్ ట్యూన్ ఇచ్చాడు. వీలైనంత త్వరగా విశ్వంభర పబ్లిసిటీని మళ్ళీ ట్రాక్ మీద తేవాల్సిన అవసరం చాలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates