పీఆర్ లేకుంటే కష్టం.. హీరోయిన్ తెలుసుకున్న సత్యం

ఈ రోజుల్లో సినీ రంగాన్ని నడిపించేదే సోషల్ మీడియా, పీఆర్ అనే అభిప్రాయం ఉంది. అది లేకుండా ఇక్కడ మనుగడ సాగించడం చాలా కష్టం అంటారు. ఐతే ఒకప్పుడు మాత్రం తనకు ఇవేవీ అవసరం లేదని భావించేదాన్నని.. కానీ చాలా లేటుగా ఇవి ఎంత అవసరమో తెలుసుకున్నానని అంటోంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. తాను ఒక దశలో సినిమాలే మానేద్దామని అనుకున్నానని.. కానీ తర్వాత తన ఆలోచన మారిందని ఆమె వెల్లడించింది. తెలుగు సినిమాల్లో నటించడం తనకు సవాలుగా మారిందని.. ఆ ఇబ్బందిని కూడా కష్టపడి అధిగమించానని ఆమె చెప్పింది.

ఒక ఇంటర్వ్యూలో రెజీనా చెప్పిన మరిన్ని విశేషాలు తన మాటల్లోనే.. ‘‘నాకు ఫిలిం బ్యాగ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగాను. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో సెట్‌కు వెళ్లడం, నటించడం, వచ్చేయడం.. ఇంతే అనుకునేదాన్ని. పీఆర్‌, సోషల్ మీడియా.. ఇవేవీ అవసరం లేదు అనుకునేదాన్ని. చాన్నాళ్లు వీటికి దూరంగా ఉండేదాన్ని. నా నటనను చూసి అవకాశం ఇవ్వాలి తప్ప పబ్లిసిటీ చూసి కాదు అనుకునేదాన్ని. కానీ కాలం గడిచేకొద్దీ వీటి అవసరం తెలిసి వచ్చింది.

ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే నా వర్క్‌ను జనాల్లోకి తీసుకెళ్తున్నాను. కెరీర్లో ఒక దశలో నాకు విసుగొచ్చింది. 2015-16 టైంలో ఇక సినిమాలు చేయాలనిపించలేదు. నటన మానేయాలనుకున్నా. చేతిలో ఉన్న సినిమలు పూర్తి చేసి ఒక కెరీర్‌‌కు ముగింపు పలకాలనుకున్నా. కానీ 2018 నుంచి మళ్లీ నాకు అవకాశాలు వరుస కట్టాయి. అక్కడ్నుంచి భిన్నమైన పాత్రల్లో నటించడం మొదలుపెట్టా. తెలుగు సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డా. నాకు తెలుగు రాదు. ఉదయం డైలాగులు ఇచ్చేవాళ్లు. వాటిని కంఠస్థం చేసి నటించడం కష్టమయ్యేది. కానీ తర్వాతి రోజుల్లో తెలుగు నేర్చుకున్నా. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నా’’ అని రెజీనా తెలిపింది.