నాకు కథలు చెప్పలేదు.. డబ్బులివ్వలేదు-పవన్

రాజకీయల్లోకి వెళ్లడం వల్ల సినిమాల పరంగా తాను చాలా నష్టపోయానని గతంలో పలు సందర్భాల్లో చెప్పాడు పవన్. ఐతే తిరిగి సినిమాల్లోకి రావాలని అనుకున్నపుడు తనకు ఇండస్ట్రీ నుంచి సరైన సహకారం లభించలేదంటూ తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు కథలు చెప్పడం మానేశారని.. అలాగే తన సినిమాలకు డబ్బులు పెట్టడానికి ఫైనాన్షియర్లూ ముందుకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాల పరంగా తాను చెల్లించుకున్న మూల్యం ఇదని పవన్ వ్యాఖ్యానించాడు.

‘‘నేను పెద్ద స్టార్ అనను. కానీ బాగా పాపులారిటీ ఉన్న నటుడినే. కానీ రాజకీయాల్లోకి వచ్చాక సినిమా వాళ్లు నన్ను నమ్మడం మానేశారు. నేను సినిమాల్లోకి మళ్లీ రావాలనుకున్నా సరే.. నాకు కథ చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇతను రాజకీయాల్లో ఉన్నాడు. మనం ఇతణ్ని నమ్మలేం అనుకున్నారు. నా దగ్గరికి రావడమే మానేశారు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే.. నేను సపోర్ట్ చేసి నిలబెట్టిన ఫైనాన్షియర్లే నా సినిమాలకు ఫైనాన్స్ చేయడానికి వెనుకాడారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల నేను చెల్లించిన మూల్యం అది’’ అని పవన్ పేర్కొన్నాడు. 

ఇక ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయంలో పడ్డ ఇబ్బందుల గురించి పవన్ మాట్లాడుతూ.. ‘‘ఇది ధర్మాన్ని కాపాడే నేపథ్యంలో సాగే సినిమా. కానీ దీన్ని పూర్తి చేయడం, రిలీజ్ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. నేను ఎంత పాపులర్ నటుడిని అయినా.. వేరే హీరోలతో పోటీ పడే స్థాయిలో లేను. వాళ్లంతా ప్రొఫెషనల్స్. కానీ నేను సినిమాలు వదిలేసి రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాను. దేశం కోసం, రాజకీయాల కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పోరాటం మొదలుపెట్టాను. దీని వల్ల నా ప్రొఫెషనల్ కెరీర్ దెబ్బ తింది. ఈ సినిమా డబ్బుల కోసం చేసింది కాదు. నిర్మాత కష్టాల్లో ఉండడం చూసి నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదనుకున్నాను. నాకు డబ్బులు ముఖ్యం కాదు. నా వంతుగా అన్ని రకాలుగా సహకారం అందించి ఈ సినిమాను ఎక్కువ మంది దగ్గరికి తీసుకువెళ్లాలని ప్రయత్నించాను’’ అని పవన్ తెలిపాడు.