వార్ 2 నిర్మాతలకు సైయారా కనకవర్షం

కొన్నిసార్లు అనుకోనివి జరగడమే జీవితమని ప్రతి ఒక్కరికి ఋజువవుతూనే ఉంటుంది. తాజాగా వార్ 2 నిర్మాతలు యష్ రాజ్ ఫిలింస్ కి ఇది అనుభమవుతోంది. గత ఏడాది దర్శకుడు మోహిత్ సూరి తను రాసుకున్న సైయారా కథను చాలా ప్రొడక్షన్ హౌసులకు తీసుకెళ్లాడు. కానీ ఇప్పుడున్న హారర్, యాక్షన్ ట్రెండ్ లో ఇంత రొమాన్స్ ఉన్న సెన్సిటివ్ లవ్ స్టోరీని ఎవరు చూస్తారంటూ చాలా మంది తిరస్కరించారు. అక్షయ్ విధాని అనే ప్రొడ్యూసర్ ముందుకొచ్చారు. కానీ ఆయన దగ్గర పూర్తి ఆర్థిక వనరులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదు. సరేనని మద్దతు కోసం యష్ రాజ్ ఫిలింస్ ని సంప్రదించాడు మోహిత్ సూరి.

ఆదిత్య చోప్రాకు సైయారాలో ఒరిజినాలిటీ కనిపించింది. ఆషీకీ 2 ఛాయలు కొన్ని ఉన్నప్పటికీ యూత్ మిస్ అవుతున్న మ్యూజిక్ అండ్ లవ్ వైబ్ ఇందులో ఉందని గుర్తించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఒక్కసారిగా సైయారా రేంజ్ మారిపోయింది. చకచకా షూటింగ్ జరిగిపోయింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా రిలీజైపోయింది. మార్కెటింగ్ లో తలలు పండిన యష్ రాజ్ ఫిలింస్ జనాన్ని రప్పించేందుకు పెట్టిన వన్ ప్లస్ వన్ ఆఫర్లు, డిస్కౌంట్లు మొదటి రోజు బ్రహ్మాండంగా పని చేశాయి. తర్వాత వాటి అవసరమే లేకుండా టాక్ వచ్చేసి ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ నిండిన థియేటర్లు కనిపిస్తున్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే యష్ రాజ్ ఫిలిమ్స్ కి ఇది ఊహించిన దాని కన్నా పెద్ద జాక్ పాట్. వారం తిరక్కుండానే 150 కోట్లకు పరుగులు పెట్టడమంటే మాటలు కాదు. ఫైనల్ రన్ ఇంకా దూరం ఉంది కాబట్టి ఈజీగా అయిదు వందల కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టడం ఖాయమే. ఆగస్ట్ 14 తమ వార్ 2 వచ్చేదాకా దేశవ్యాప్తంగా సైయారానే రన్ చేసేలా యష్ రాజ్ సంస్థ తమ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లను నిర్దేశించిందట. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఈ సినిమా చూపిస్తున్న దూకుడు మాములుగా లేదు. కుర్రకారుతో హాళ్లు నిండిపోతున్నాయి. అత్యద్భుతం అనిపించే రేంజ్ లో బొమ్మ లేదు కానీ మ్యూజిక్, ఆహాన్ – అనీత్ జోడి వర్కౌట్ చేసేశాయి.