సెకండ్ షోలు కళకళలాడి ఎంత కాలమయ్యిందో

రేపు రాత్రి టాలీవుడ్ కు బిగ్గెస్ట్ నైట్ కాబోతోంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే టైం వస్తోంది. గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో సెకండ్ షోలు పడటం లేదు. కనీసం ఓ పది మంది ఆడియన్స్ రాలేని పరిస్థితుల్లో గేట్లు వేసేసి ఇంటికి వెళ్లిపోతున్న దాఖలాలు చాలా ఉన్నాయి. అంతో ఇంతో టాక్ వచ్చినవి తప్ప మిగిలినవి సాయంత్రంకే ప్యాకప్ చెప్పేస్తున్నాయి. ఇలాంటి నెగటివ్ ట్రెండ్ లో హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ప్రీమియర్లు పడబోతున్నాయి. టికెట్ రేట్లు 600 నుంచి 700 రూపాయల మధ్యలో ఉన్నా సరే ఆన్ లైన్లోనే సోల్డవుట్ అవుతున్నాయి.

మెయిన్ సెంటర్స్ లో ఉన్న థియేటర్ల టికెట్లు ఆఫ్ లైన్ లో అభిమాన సంఘాలు గంపగుత్తగా కొంటుండగా మిగిలిన చోట్ల ఫ్యాన్ అసోసియేషన్లు గ్రూపులుగా మారిపోయి యాజమాన్యాల దగ్గర బల్క్ లో కొనేస్తున్నాయి. వాళ్ళు తీసుకోగా మిగిలినవి బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో పెడుతున్నారు. నిజానికి ఇంత రేట్ అంటే బుకింగ్స్ నెమ్మదిగా ఉంటాయమోననే అంచనాకు భిన్నంగా ట్రెండింగ్ చాలా ఫాస్ట్ గా ఉండటం మంచి పరిణామం. ఏపీ తెలంగాణలో రేపు అర్ధరాత్రి షోలు పూర్తయ్యాక బయటికి వచ్చే జనాలతో, రోడ్లలో కనిపించే సందడి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఖాయం.

పలువురు థియేటర్ ఓనర్లు, ఎగ్జిబిటర్లు చెబుతున్న దాని ప్రకారం రేపు పార్కింగ్ స్టాండ్లు, క్యాంటీన్లు సర్వం సిద్ధం చేసుకుని ఉంచుతున్నారు. ఎన్నో వారాల తర్వాత రాత్రి షోకు హాలు నిండా జనాన్ని చూసే అవకాశం రావడంతో దానికి తగ్గట్టే సరుకును రెడీ చేసి పెడుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ కిటకిటలాడుతున్న సినిమా హాళ్లను చూసి నెలలు దాటింది. మళ్ళీ ఇప్పుడా సందర్భం వచ్చింది. కాకపోతే హరిహర వీరమల్లుకి వచ్చే టాక్ మొదటి వీకెండ్ వసూళ్లను ఏ కోణంలో ప్రభావితం చేస్తుందో చూడాలి. పాజిటివ్ అయితే మాత్రం ఆదివారం దాకా టికెట్ ముక్క దొరకడం కష్టమే. చూద్దాం.