ల్యాగ్ ఉండాల్సిందే అంటున్న దృశ్యం దర్శకుడు

ఈ తరం ప్రేక్షకులకు ఓపిక చాలా తక్కువ. సినిమా రయ్యిన దూసుకెళ్లిపోవాలి. ఆరంభం నుంచే కథనం పరుగులు పెట్టాలి. ఏమాత్రం నెమ్మదించినా.. ‘ల్యాగ్’ అనేస్తారు. సినిమా నిడివి ఎక్కువ ఉన్నా.. ‘ల్యాగ్’ అనే కంప్లైంట్ వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయిన ఈ పదం విషయంలో మలయాళ స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. సినిమాకు ‘ల్యాగ్’ అనేది చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

మలయాళంలో ‘దృశ్యం’, ‘దృశ్యం-2’, ‘నేరు’.. ఇలా అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడు జీతు. ప్రస్తుతం ఆయన మోహన్ లాల్‌తో ‘దృశ్యం-3’ చేస్తున్నారు. తన సినిమాలు అని కాకుండా మొత్తంగా మలయాళ సినిమల్లో ల్యాగ్ గురించి కంప్లైంట్ చేసే వాళ్లకు ఆయన ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. ఏ కథా ఆరంభం నుంచే పరుగులు పెట్టదని.. ముందు కథకు ఒక పునాది పడడం.. క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ కావడం ఎంతో అవసరమైన విషయాలు అని జీతు అభిప్రాయపడ్డాడు.

ప్రేక్షకులను ఒక మూడ్‌లోకి తీసుకెళ్లాలంటే కొంత సమయం పడుతుందని.. అలాంటపుడు ల్యాగ్ అనే ఫీలింగ్ తప్పకుండా వస్తుందని.. సినిమాకు ఈ ‘ల్యాగ్’ చాలా అవసరమని జీతు అన్నాడు. తన కొత్త సినిమా ‘దృశ్యం-3’లో కూడా ఈ ల్యాగ్ ఉంటుందని.. దీనికి ప్రిపేరై ఉండాలని జీతు చెప్పడం విశేషం. దృశ్యం, దృశ్యం-2 సినిమాల్లో కూడా ప్రథమార్ధంలో ఒక దశ వరకు కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ తర్వాత కథలోని మలుపులు బయటికి వచ్చాక కథనం పరుగులు పెడుతుంది. ముందు మామూలుగా తోచిన సన్నివేశాలు కూడా తర్వాత భలేగా అనిపిస్తాయి. అదంతా జీతు స్క్రీన్ ప్లేలోని మ్యాజిక్. ఈ నేపథ్యంలోనే ‘ల్యాగ్’ అనే మాట ఓవర్ రేటెడ్ అంటూ తనదైన శైలిలో విశ్లేషించాడు జీతు.