పవన్ ఫ్యాన్స్.. రీమేక్ గోల ఆపేస్తారా?

తాము ఎంతగానో అభిమానించే హీరో ఒక సినిమా మొదలుపెడుతుంటే.. అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతారు. దాన్ని భుజాల మీద మోస్తారు. కానీ టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కథ వేరు. చాలా ఏళ్ల నుంచి ఆయన సినిమా ఒకటి మొదలవుతుంటే చాలు.. నెగెటివ్ ట్రెండ్స్ మొదలుపెట్టడం.. మేకింగ్ టైంలో కూడా ఆ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించడం లాంటివి చేస్తున్నారు అభిమానులు. వాళ్ల ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం.. ఆయన స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లను పట్టాలెక్కించడమే. 

గత పదేళ్ల వ్యవధిలో ఆయన పది సినిమాలను లైన్లో పెడితే.. అందులో సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి, హరిహర వీరమల్లు, ఓజీ మాత్రమే స్ట్రెయిట్ సినిమాలు. మిగతా ఆరు రీమేక్‌లే. గోపాల గోపాల, కాటమ రాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. రీమేక్‌లే అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సైతం రీమేకే అనే సందేహాలున్నాయి. వరుస రీమేక్‌లతో విసిగిపోయిన ఫ్యాన్స్.. ఒక దశ దాటాక సోషల్ మీడియాలో ఆయా చిత్ర బృందాల మీద ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. పవన్‌‌తో రీమేక్‌లు తీస్తున్న దర్శక నిర్మాతలతో పాటు.. ఈ సినిమాలు సెట్ చేసి పెడుతున్న త్రివిక్రమ్‌ను కూడా టార్గెట్ చేశారు.

ఐతే ఇలా గొడవ చేస్తున్న అభిమానులకు ఒక్క హరీష్ శంకర్ మాత్రమే కౌంటర్ ఇస్తూ వచ్చాడు. మిగతా వాళ్లెవ్వరూ మాట్లాడింది లేదు. ఐతే ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణే ఫ్యాన్స్‌కు ఈ విషయంలో వివరణ ఇచ్చారు. వరుసగా రీమేక్స్ చేస్తున్నానంటూ అభిమానులను తనను తిడుతుంటారంటూ ‘హరిహర వీరమల్లు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ వ్యాఖ్యానించడం విశేషం. పార్టీని నడపడానికి, కుటుంబం కోసం డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని.. స్ట్రెయిట్ సినిమాలు తీస్తే టైం పడుతుందని.. తనకున్న పొలిటికల్ కమిట్మెంట్ల మధ్య తక్కువ టైంలో సినిమాలు పూర్తి చేసి డబ్బులు సంపాదించడం కోసం రీమేక్‌లను ఎంచుకోవాల్సి వచ్చిందని పవన్ చెప్పాడు. 

త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తూ.. రీమేక్‌లను సెట్ చేసి పెట్టేది కూడా ఆయనే అనే అర్థం వచ్చేలా కూడా మాట్లాడాడు. ఈ విషయాలన్నీ తెలిసినవే, సినీ జనాల చర్చల్లో ఉన్నవే అయినప్పటికీ.. స్వయంగా పవనే ఇప్పుడు చెప్పడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లు పెద్ద గొడవ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్.. రేప్పొద్దున ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చినపుడు కూడా నెగెటివ్ ట్రెండ్స్ చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ పవనే స్వయంగా రీమేక్‌లు చేయడానికి స్పష్టమైన కారణం చెప్పాడు కాబట్టి.. ఇక నుంచైనా ఫ్యాన్స్ సైలెంట్ అయితే బెటరేమో. అంతకంటే ముందు పవన్ నుంచి రానున్న రెండు స్ట్రెయిట్ సినిమాలకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.