భల్లాల దేవా వెనుక ట్విస్టింగ్ స్టోరీ

అక్టోబర్ 31 బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మరోసారి ప్రమోషన్లను రాజమౌళి టీమ్ వేగవంతం చేసింది. రెండు భాగాలు కలిపి ఒకే పార్ట్ చేయడమే కాక కొన్ని డిలీటెడ్ సీన్స్ కలపనుండటంతో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర మాధ్యమాలను వేదికగా చేసుకుని బాహుబలి బృందం సరికొత్త పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది. ఒకవేళ కట్టప్ప కనక బాహుబలిని వెనుక నుంచి పొడవకపోయి ఉంటే ఏం జరిగేది లాంటి ప్రశ్నలను సంధిస్తూ కొత్త తరహా పబ్లిసిటీకి నాంది పలికింది. ఇదిలా ఉండగా ఇప్పుడీ విజువల్ గ్రాండియర్ కు సంబంధించిన బిహైండ్ స్టోరీస్ బయటికి వస్తున్నాయి.

బాహుబలి క్యాస్టింగ్ ని ఎంపిక చేసుకునే క్రమంలో భళ్లాలదేవా పాత్రకు ముందు రానాను అనుకున్నారు. కానీ అతని డేట్స్ ఖాళీగా లేవు. దీంతో నెక్స్ట్ ఆప్షన్ గా సీనియర్ నటి జయసుధ తనయుడు నీహార్ కపూర్ ని సంప్రదించారు. వెంటనే అతను ఓకే చెప్పాడు. సుమారు నెల రోజుల పాటు వర్క్ షాప్ లో పాల్గొన్నాడు. ఇంతలో ఏమయ్యిందో ఏమో రానా వెంటనే కబురు పెట్టి భల్లాలదేవాగా చేస్తానని రాజమౌళికి చెప్పేశాడు. దీంతో నీహార్ కపూర్ కి కాలకేయ పాత్ర ఆఫర్ చేశారు. క్యారికేచర్లు, ప్రోస్తెటిక్ మేకప్ వగైరాలు చూసి తల్లి సలహా మేరకు దానికి నో చెప్పేశాడు. తర్వాత అది ప్రభాకర్ కు వెళ్లిపోవడం, కాలకేయ ఇంటిపేరుగా మారిపోవడం చూశాం.

ఇదంతా ఒక తాజా ఇంటర్వ్యూలో నీహార్ కపూర్ చెప్పుకొచ్చాడు. అంత గొప్ప నటికి వారసుడు అయినప్పటికీ భారీ దేహంతో విలన్ లక్షణాలు ఎక్కువగా అందిపుచ్చుకున్న నీహార్ కొన్ని సినిమాల్లో నటించినా అవేవి పేరు తీసుకురాలేదు. దీంతో నటనకు దూరంగా ఉన్నాడు. ఒకవేళ నిజంగా కాలకేయగా నటించి ఉంటే ఇప్పుడు కెరీర్ ఇంకోలా ఉండేదేమో. లేదూ రానా డేట్లు అడ్జస్ట్ కాక ఇతనే భల్లాల దేవాగా నటించి ఉంటే ఈపాటికి బిజీ ఆర్టిస్టుగా మారిపోయి ఉండేవాడు. ఏది ఏమైనా తినే వాడి పేరు ఉంటే తప్ప బియ్యం గింజ నోట్లోకి వెళ్ళదు. పాత్రలు కూడా అంతే. ఎవరి కోసం సృష్టించబడి ఉంటాయో వాళ్ళకే వెళ్తాయి.