ఒక సినిమాకు ఒకరికి మించి సంగీత దర్శకులు పాటలు ఇవ్వడం ఇప్పుడు బాలీవుడ్లో కామన్ అయిపోయింది. కానీ ఇందుకు అందరు సంగీత దర్శకులూ ఆసక్తితో ఉండరు. ముఖ్యంగా సౌత్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒక సినిమాకు పని చేస్తుంటే.. అన్ని పాటలూ తామే చేయాలనుకుంటారు. నేపథ్య సంగీతం బాధ్యతల్ని వేరే వాళ్లకు అప్పగించినా ఫీలవుతారు. గత ఏడాది ‘పుష్ప-2’ సినిమాకు స్కోర్ ఇవ్వడం కోసం దర్శకుడు సుకుమార్ వేరే సంగీత దర్శకులను ఆశ్రయిస్తే.. దేవిశ్రీ ప్రసాద్ ఎంత హర్టయ్యాడో స్పష్టంగా అర్థమైంది.
ఐతే సౌత్ ఇండస్ట్రీకే చెందిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. కెరీర్లో ఇలా వేరే సంగీత దర్శకులతో వర్క్ పంచుకోవడం తక్కువే అయినప్పటికీ.. ఇప్పుడు ఆయన తన లాగే దిగ్గజ స్థాయి ఉన్న ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి పని చేస్తున్నాడు. ఆ సంగీత దర్శకుడే.. హన్స్ జిమ్మర్. ఇంటర్‌స్టెల్లార్, డ్యూన్ లాంటి ఫేమస్ హలీవుడ్ చిత్రాలకు పని చేయడమే కాక.. రెండుసార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఘనత హన్స్ సొంతం.
ప్రస్తుతం రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి ‘రామాయణం’ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ కలయిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెహమాన్ ఉండగా.. మరొకరు ఎందుకనే ప్రశ్నలను ఆయన అభిమానులు లేవనెత్తారు. కానీ రెహమాన్ మాత్రం ఈ విషయంలో రవ్వంతైనా ఇగో లేకుండా హన్స్‌తో కలిసి పని చేస్తున్నాడు. తామిద్దరం కలిసి చర్చించుకుని ‘రామాయణం’ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న విషయాన్ని వెల్లడించాడు. తమ మధ్య ఎంత సమన్వయం ఉందో అతను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘రామాయణం’ కోసం హన్స్, తాను కలిసి ఇప్పటికే మూడు మ్యూజిక్ సెషన్లలో పాల్గొన్నామని.. లండన్, లండన్, దుబాయ్‌ల్లో ఇవి జరిగాయని రెహమాన్ వెల్లడించాడు. హన్స్ అన్ని విషయాల్లో తనలాగే ఆలోచిస్తాడని.. మన సంస్కృతి మీద ఎంతో గౌరవం ఉందని.. తనకు ఏమైనా అర్థం కాకపోతే.. ‘దీన్ని వెస్ట్రన్ స్టైల్లో కంపోజ్ చేయొచ్చా’ అని వినమ్రంగా అడుగుతారని రెహమాన్ చెప్పాడు. హన్స్ లాంటి గొప్ప సంగీత దర్శకుడితో తాను పని చేస్తానని.. తనతో పాటు ఎవ్వరూ ఊహించి ఉండరని.. ఇద్దరం కలిసి గొప్ప ఔట్ పుట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని.. ‘రామాయణం’ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుందని.. కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని రెహమాన్ ధీమా వ్యక్తం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates