విషాదం – ఫిష్ వెంకట్ ఇక లేరు

గత కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రతినిధులు, మంత్రులు పూర్తి ఆర్థిక సహాయానికి అంగీకారం తెలిపిన కొద్దిరోజులకే ఇలా జరగడం విషాదం.ఈయన వయసు 53. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఫిష్ వెంకట్ రెండు మూడేళ్ళ నుంచి బాధ పడుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ వ్యాధి ముదిరిపోవడంతో కోలుకునే అవకాశం లేకుండా పోయింది. పేరుకి చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ ఫిష్ వెంకట్ కి ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. బయట ఎక్కడ కనిపించినా ఠక్కున గుర్తు పట్టేవారు.

ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. పెద్దగా చదువుకోలేదు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల కారణంగా మూడో తరగతి దగ్గరే స్కూలుకెళ్ళడం ఆపేశారు. జీవనోపాధి కోసం ముషీరాబాద్ కూరగాయల మార్కెట్ లో చేపలు అమ్ముకునే వెంకటేష్ కి ఆ వ్యాపారమే ఇంటి పేరుగా మారిపోయి ఫిష్ వెంకట్ గా పాపులరయ్యారు. రియల్ స్టార్ శ్రీహరి ఈయనకు మంచి మిత్రుడు. ఓ సందర్భంలో దర్శకుడు వివి వినాయక్ ని పరిచయం చేసినప్పుడు సపోర్టింగ్ రోల్స్ కి బాగా పనికి వస్తాడని గుర్తించి అవకాశం ఇచ్చారు. అలా జూనియర్ ఎన్టీఆర్ ఆదితో తొలి అడుగు పడింది. తొడకొట్టు చిన్నా డైలాగుతో మాస్ కి బాగా దగ్గరయ్యారు.

అక్కడి నుంచి ఫిష్ వెంకట్ కు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. బన్నీ, కింగ్, శౌర్యం, రెడీ, శంఖం, డాన్ శీను, వరుడు, అదుర్స్, మిరపకాయ్, వీర, కందిరీగ, గబ్బర్ సింగ్, నాయక్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, రాధ, డీజే టిల్లు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో మంచి పాత్రలు చేశారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో స్క్రీన్ పంచుకోవడం పట్ల ఫిష్ వెంకట్ పలు సందర్భాల్లో ఆనందం వ్యక్తం చేసేవారు. మొన్న జనవరిలో ఆహా ఓటిటిలో విడుదలైన కాఫీ విత్ కిల్లర్ ఈయన చివరి సినిమా. అవార్డులు రాకపోయినా అంతకుమించి ప్రశంసలు అందుకున్న ఫిష్ వెంకట్ లోటు తీర్చలేనిది.