ఇంత టాలెంట్ ఎక్కడ దాచావ్ రామ్

స్టార్ హీరోలు పాటలు పాడటం కామన్. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరూ రకరకాల సందర్భాల్లో వివిధ సినిమాలకు గొంతు ఇచ్చినవాళ్ళే. కానీ లిరిక్స్ రాసే సాహసం మాత్రం ఎవరూ చేయలేకపోయారు. మాట్లాడ్డం ఈజీ కానీ ప్రాసలతో కూడిన గీత రచన చేయడం చాలా కష్టం. వేటూరి తరం నుంచి రామజోగయ్య శాస్త్రి జనరేషన్ దాకా ఈ రంగంలో ముద్ర వేసిన వాళ్ళు ఎందరో. ఆస్కార్ వేదిక మీద చంద్రబోస్ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడీ టాపిక్ రావడానికి కారణం ఎనర్జిటిక్ స్టార్ రామ్. త్వరలో విడుదల కాబోతున్న ఆంధ్రా కింగ్ తాలూకాలో ఒక పాట రాసేశాడు.

ఏదో ఆషామాషీ సందర్భమైతే ఏమో అనుకోవచ్చు కానీ ఒక ప్రియుడి భావాలను ప్రేయసికి వర్ణించిన తీరు చూస్తుంటే ఎంతో అనుభవమున్న లిరిసిస్టులా అనిపిస్తాడు. కొన్ని తడబాట్లు ఉన్నాయి కానీ ఓవరాల్ గా ప్రయత్నం మాత్రం చాలా బాగా వచ్చింది. అసలైన మేజిక్ అనిరుధ్ రవిచందర్ గళంతో రాగా, వివేక్ – మెర్విన్ ట్యూన్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఒక చూపు నాలోన పుట్టిందే, ఏదో వింతగా గుండెల్లో చేరిందే అంటూ తక్కువ పదాలతో రామ్ చేసిన గారడీ బాగుంది. దర్శకుడు మహేష్ బాబు టేస్ట్ తో పాటు చాలా కాలంగా మంచి మెలోడీ సాంగ్ వినలేదనే లోటు ఇది తీర్చేలా ఉంది.

సెప్టెంబర్ లేదా అక్టోబర్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఆంధ్రాకింగ్ తాలూకాకు వివేక్ మెర్విన్ ని తీసుకోవడం ఎంత తెలివైన నిర్ణయమో మొదటి సాంగ్ తోనే అర్థమైపోయింది. ఉపేంద్ర ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మిస్టర్ బచ్చన్ లాంటి ఫ్లాప్ తో పరిచయమైనా వరస ఆఫర్లు కొట్టేస్తున్న ఈ భామ రామ్ సరసన సరిగ్గా సరిపోయింది. టైటిల్ తొలుత కొంత మాస్ గా అనిపించినప్పటికీ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఉన్న విషయం కూడా అర్థమైపోయింది. అక్కర్లేని మాస్ జోలికి వెళ్లి వరస ఫ్లాపులు చవి చూసిన రామ్ కు ఆంధ్రాకింగ్ తాలూకా పెద్ద రిలీఫ్ ఇచ్చేలా ఉంది.