నిధి అగర్వాల్ సిన్సియారిటీని మెచ్చుకోవాలి

మాములుగా హీరోయిన్లు ఎంత ప్రమోషన్ అయినా సరే ఒక పరిధి వరకే సహకరిస్తారు. అంతకు మించి అంటే అలసట లాంటి సవాలక్ష కారణాలు వాళ్లకు అడ్డంకిగా నిలుస్తాయి. కానీ నిధి అగర్వాల్ మాత్రం హరిహర వీరమల్లు కోసం అవుట్ అఫ్ ది బాక్స్ పబ్లిసిటీలో భాగమవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా వీటిలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో అంతా తానై భుజాల మీద మోస్తోంది. నిన్న ఒక్క రోజులోనే 15 పైగా మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆమె ఓపికకు నిదర్శనం. సగటున ఒక్కొకటి కనిష్టంగా అరగంట వేసుకున్నా ఎనిమిది గంటల పాటు కుర్చీలో కూర్చుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం గ్రేటే.

ఇంత కష్టం ఎందుకంటే నిధి అగర్వాల్ కు హరిహర వీరమల్లు సక్సెస్ చాలా కీలకం. ది రాజా సాబ్ ఇంకా దూరంలో ఉంది కాబట్టి ముందు పవన్ తో ఒక హిట్టు ఖాతాలో వేసుకుంటే తర్వాత మరికొన్ని ప్యాన్ ఇండియా ఆఫర్లు వస్తాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అయిదు సంవత్సరాల నిధి కెరీర్ లో పెద్దగా అద్భుతాలు జరగలేదు. పూరి జగన్నాథ్ బ్రేక్ ఇచ్చాడు కాబట్టి ఇలియానా రేంజ్ లో దూసుకుపోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ జరిగింది వేరు. పైగా తాను ఒప్పుకున్న రెండు సినిమాలు హరిహర వీరమల్లు, రాజా సాబ్ అనుకోకుండా విపరీతమైన జాప్యానికి గురి కావడం కాకతాళీయమే అయినా తప్పలేదు.

నిడివి పరంగా ఎక్కువే కనిపిస్తానని చెబుతున్న నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా ఇరవై శాతం షూటింగ్ పూర్తయ్యిందని అప్డేట్ ఇచ్చేసింది. పవర్ స్టార్ పక్కన జోడి కట్టడం తనకు ఎంత ప్లస్ అవుతుందనేది ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ లోనే ఉంటున్న నిధి అగర్వాల్ కు గ్లామర్ షో చేసే అవకాశం లేకపోయినా దర్శకుడు జ్యోతికృష తనను హుందాగా చూపించిన వైనం అందంగా కనిపించింది. 21 హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ఎలాంటి ఎలివేషన్లు ఇస్తుందో చూడాలి. మెయిన్ క్యాస్టింగ్ ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో నిధినే పబ్లిసిటీ భారం మోస్తోంది.