హరిహర వీరమల్లు హిట్టవ్వాలనేది కంటెంట్ మీద ఆధారపడినప్పటికీ దీని గెలుపు పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ నిర్మాత ఏఎం రత్నంకు చాలా అవసరం. ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా అదే. అయిదేళ్ల నిర్మాణం. లెక్కలేనన్ని వాయిదాలు. వందల కోట్ల ఖర్చు. ఎదురు చూడటంలోనే సంవత్సరాలు గడిచిపోయాయి. అడిగితే పవన్ ఒక కమర్షియల్ మూవీ అయినా సరేననే వారు. కానీ రత్నం లక్ష్యం అది కాదు. ఎప్పటికి మర్చిపోలేని ఒక విజువల్ గ్రాండియర్ ఇవ్వాలి. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ చేయని జానర్ ని టచ్ చేయాలి. బాహుబలి లాంటి ల్యాండ్ మార్క్ మూవీ తన బ్యానర్ లో ఎప్పటికీ ఉండిపోవాలి.
కరోనా బ్రేకులు, మధ్యలో సెట్లకు జరిగిన ప్రమాదాలు, దర్శకత్వం నుంచి క్రిష్ తప్పుకోవడం లాంటి ఎన్నో అవాంతరాలు వీరమల్లుని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇంకో ప్రొడ్యూసర్ అయితే మధ్యలోనే చేతులు ఎత్తేసేవారేమో కానీ రత్నం మాత్రం తప్పుకోలేదు. అన్ని సిద్దమనుకుని రిలీజ్ డేట్ ప్రకటించాక కూడా వాయిదా వేయాల్సి రావడం, విఎఫెక్స్ కంపెనీల చుట్టూ తిరగడం ఇలా మాములు నరకం చూడలేదు. ఆఖరికి నెల రోజుల క్రితం జూలై 24 డేట్ అనౌన్స్ చేశాక సైతం ఫ్యాన్స్ అనుమానంగా చూశారంటే ఈ ప్రాజెక్టు ఎన్ని ఆటుపోట్లు, అవమానాలకు గురయ్యిందో అర్థం చేసుకోవచ్చు. వాటికి సమాధానం చెప్పాలి.
ఇంత జరిగినా రత్నం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల హక్కులను గంపగుత్తగా అమ్మకుండా అడ్వాన్స్ పద్ధతి మీద స్వంతంగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నారట. కొన్ని ఏరియాలు మినహాయించి దాదాపు ఇదే చేస్తారని సమాచారం. ఇన్ని వాయిదాలు, రిస్కులు భరించి హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇక్కడితో అయిపోలేదు. బెనిఫిట్ షో పడే దాకా ఏదో ఒక టెన్షన్ వెంటాడుతూనే ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంత దీన్ని తగ్గించొచ్చు. ఏది ఏమైనా ఇంత పెద్ద సాహసానికి పూనుకున్న ఏఎం రత్నం లాంటి నిర్మాతలు మరిన్ని ప్రయోగాలు చేయాలంటే వీరమల్లు హిట్టవ్వాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates